బీరూట్: యుద్ధంలో ఇరాన్‌కు మద్దతిస్తున్నందుకు లెబనీస్ గ్రూప్ హిజ్బుల్లాను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. సౌత్, ఈస్ట్ లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో పాటు భూతల దాడులను ముమ్మరం చేసింది. ముఖ్యంగా దక్షిణ లెబనాన్‌లోని టైర్, సిడోన్ వంటి ప్రధాన నగరాలపై ఫోకస్ ఎక్కువగా పెట్టింది. ఈ రెండు ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే తమ ఇండ్లను వదిలి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం అల్టిమేటం కూడా జారీ చేసింది.
రాజధాని బీరూట్‌లోని దహియే ప్రాంతంపై కూడా వరుస దాడులకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. మంగళవారం ఇజ్రాయెల్‌కు చెందిన ఒక యుద్ధ ట్యాంకర్ సౌత్ లెబనాన్‌లోని క్లాయా అనే గ్రామంలో ఓ ఇంటిపై కాల్పులు జరిపింది. అక్కడ గాయపడిన వారికి సహాయం చేయడానికి స్థానికంగా క్రైస్తవ మతగురువైన ఫాదర్ పియర్ అల్-రాహి వెళ్లగా.. యుద్ధ ట్యాంకర్ ఆయనపైనా కాల్పులు జరిపింది.
దాంతో ఫాదర్ పియర్ అల్-రాహి తీవ్ర గాయాలతో మరణించారు. ఈ ఘటన లెబనాన్‌లోని క్రైస్తవ వర్గాల్లో తీవ్ర భయాందోళనలను నింపింది. శాంతిని కోరుకునే క్రైస్తవ మతగురువును కాల్చి చంపడం ఏమిటని ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి.
కాగా, గడిచిన వారం రోజుల్లోనే లెబనాన్ దేశంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల 486 మంది చనిపోయారు. దాదాపు 6.6 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇండ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లారని లెబనాన్ ప్రజారోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.
