అమెరికా ఇంధన రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేలా డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. టెక్సాస్‌లోని బ్రౌన్స్‌విల్లేలో భారీ ఆయిల్ రిఫైనరీని నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామిగా ఉండటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇది అమెరికా ఇంధన ఆధిపత్యానికి నిదర్శనమని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్టులో పేర్కొన్నారు. గత 50 ఏళ్లలో అమెరికాలో నిర్మిస్తున్న మొట్టమొదటి కొత్త రిఫైనరీ ఇదే కావడం విశేషం. అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ పేరుతో ఈ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.
ఈ మెగా ప్రాజెక్టులో పెట్టుబడి పెడుతున్నందుకు భారతీయ మిత్రులకు, ముఖ్యంగా రిలయన్స్ సంస్థకు ట్రంప్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 300 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.27 లక్షల కోట్లు విలువైన ఈ ఒప్పందం అమెరికా చరిత్రలోనే అతిపెద్ద డీల్‌గా నిలవనుంది. దీని ద్వారా వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు రానున్నాయి అమెరికాలో.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. అమెరికా తన సొంత ఇంధన వనరులను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ సరఫరాకు ఆటంకం కలుగుతుండటంతో.. బ్రౌన్స్‌విల్లే రిఫైనరీ అమెరికా జాతీయ భద్రతకు కీలకం కానుంది.
ప్రపంచంలోనే అత్యంత క్లీనెస్ట్ రిఫైనరీగా దీనిని తీర్చిదిద్దనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. పన్నుల తగ్గింపు, అనుమతుల సరళీకరణ వల్లే ఇంతటి భారీ పెట్టుబడులు దేశానికి వస్తున్నాయని చెప్పుకొచ్చారు ట్రంప్. 2026 రెండో త్రైమాసికంలో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయని సమాచారం.
ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున.. పెరుగుతున్న పెట్రోల్, గ్యాస్ ధరలు తాత్కాలికమేనని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ లక్ష్యాలు నెరవేరిన తర్వాత ధరలు భారీగా తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి రిలయన్స్-అమెరికా మధ్య కుదిరిన ఈ డీల్ గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తోందంటున్నారు నిపుణులు.
