పాక్‎లో ఇంధన సంక్షోభం.. ఇఫ్తార్విందులు రద్దు

పాక్‎లో ఇంధన సంక్షోభం.. ఇఫ్తార్విందులు రద్దు

ఇస్లామాబాద్: అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం వల్ల పాకిస్తాన్‎లో ఇంధన సంక్షోభం తీవ్రమైంది. హార్మూజ్​ జలసంధి మూత పడటంతో అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్రూడాయిల్ ధర బ్యారెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 60 డాలర్ల నుంచి 100 డాలర్లకు పెరిగింది. ఈ నేపథ్యంలో పొదుపు చర్యలు తీసుకుంటున్నట్టు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోమవారం దేశ ప్రజలకు ఒక ప్రకటనలో తెలిపారు.

రెండు నెలల పాటు కేంద్ర మంత్రులు, సలహాదారులు జీతాలు తీసుకోరని ప్రకటించారు. పార్లమెంట్ సభ్యుల జీతాల్లో 25 శాతం కోత విధించారు. గ్రేడ్ 20 పైన, నెలకు రూ.3 లక్షలకు పైగా జీతం పొందే అధికారుల రెండు రోజుల జీతాన్ని పేదల సాయానికి వినియోగించాలన్నారు. ప్రభుత్వ వాహనాల ఇంధన వినియోగంపై 50 శాతం ఇంధన కోత విధించారు. 60 శాతం వాహనాలు రోడ్డెక్కవద్దని చెప్పారు. 

ఈ పొదుపు చర్యల్లో భాగంగా అన్ని ప్రభుత్వ ఆఫీసులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేస్తాయి. బ్యాంకులకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 50 శాతం సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి. అధికారిక విందులు, రంజాన్ ఇఫ్తార్ పార్టీలు పూర్తిగా రద్దయ్యాయి. 

పెళ్లిళ్లు, పార్టీలకు గరిష్టంగా 200 మంది మాత్రమే హాజరు కావాలె. ప్రజాప్రతినిధులు, ఆధికారుల విదేశీ పర్యటనలను రద్దు. అత్యవసరమైతే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకొని వెళ్లాలి. స్కూళ్లకు 2 వారాలు సెలవు ఇచ్చారు.  పెట్రోల్, డీజిల్ అక్రమంగా నిల్వ చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.