- వేలాదిగా తరలివచ్చిన యువత
- 67 కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన 2100 మంది
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: ఆదిలాబాద్పట్టణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్మేళాకు అనూహ్య స్పందన లభించింది. జాబ్ మేళాను ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. దీనికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్‌రావు, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మట్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మబొజ్జు పటేల్, గ్రంథాలయ చైర్మన్ నర్సయ్య హాజరయ్యారు.
జాబ్ మేళాలో ఆదిలాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని 67 కంపెనీలు పాల్గొన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాల నుంచి 7500 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. 2100 మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీలను అందజేశారు. అభ్యర్థులు రూ.13 వేల నుంచి రూ.45 వేల వరకు వేతనం పొందనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సురేందర్ రావు, ఏఎస్పీలు మౌనిక, రుత్విక్ సాయి, డీఎస్పీలు జీవన్ రెడ్డి, ఇంద్ర వర్ధన్, శ్రీనివాస్, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్ పాల్గొన్నారు.
