హైదరాబాద్, వెలుగు: ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ తన సత్తా చాటిందని, కమ్యూనిస్టుల మద్దతు లేకపోతే ఫలితాలు ఎలా ఉంటాయో ఇతర పార్టీలకు ఝలక్ ఇచ్చామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. తాము పొత్తు ధర్మాన్ని తప్పకుండా పాటిస్తామని.. కానీ, ఇతర పార్టీలు ఆ పని చేయడం లేదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు ధర్మానికి విఘాతం కలిగించిందని, దాంతో ఇతర పార్టీలు లాభపడ్డాయి తప్ప, తమకు ఒరిగిందేమీ లేదన్నారు.
రానున్న ఎన్నికల పొత్తులపై నేరుగా సీఎం రేవంత్ రెడ్డినే కలిసి తేల్చుకుంటామని స్పష్టం చేశారు. పొత్తు ఉన్నా లేకున్నా ప్రజా పోరాటాలు ఆపమని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సీపీఐ జాతీయ నేతలు పల్లా వెంకట్ రెడ్డి, కె. నారాయణ పాల్గొన్నారు. జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు తమ మాతృపార్టీ అయిన సీపీఐలో చేరాలని కూనంనేని పిలుపునిచ్చారు. -ప్రజాబలం లేని కొద్దిమంది చేసే సాయుధ పోరాటాల వల్ల అంతిమ లక్ష్యం నెరవేరదని కూనంనేని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ ఆధునిక యుగ నరరూప రాక్షసుడని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. అమెరికా యుద్ధ కాంక్ష వల్ల భారత్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
