- ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 12న ఏర్పాటు
- సీఎస్రామకృష్ణారావు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 12వ తేదీన కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు. సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, మేయర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. ఈ మేరకు సోమవారం అన్ని జిల్లా ల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12,700 గ్రామ పంచాయతీలు, 110 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో ప్రాతినిధ్యం వహిస్తున్న 15 వేల మంది ప్రజాప్రతినిధులకు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. మున్సిపల్ చట్టాలు, సిటిజెన్ చార్టర్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్‌పై వీరికి అవగాహన కల్పించనున్నారు. కొత్తగా ఎన్నికైన వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని సీఎస్ రామకృష్ణారావు ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
