కేసీఆర్ డైరెక్షన్‌‌లోనే మాపై దాడులు : షర్మిల

కేసీఆర్ డైరెక్షన్‌‌లోనే మాపై దాడులు : షర్మిల

హైదరాబాద్, వెలుగు: తన పాదయాత్రను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, ఆయన డైరెక్షన్‌‌లోనే ఉద్దేశపూర్వంగానే తనపై దాడి జరిగిందని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. తనను అరెస్ట్ చేయడానికి కేసీఆర్ ముందే ప్లాన్ వేశారన్నారు. నర్సంపేటలో, హైదరాబాద్‌‌లో లా అండ్ ఆర్డర్ సమస్య పుట్టించింది పోలీసులు, టీఆర్ఎస్ గూండాలేనని మండిపడ్డారు. ఫ్లెక్సీలు, బస్సును తగులబెట్టి, కార్యకర్తలను కొట్టి, వాహనాలను ధ్వంసం చేశారని, కానీ దాడి చేసిన టీఆర్ఎస్ గూండాలను వదిలి పోలీసులు తమను అరెస్ట్ చేశారని చెప్పారు. గురువారం రాజ్‌‌భవన్‌‌లో గవర్నర్ తమిళిసైని షర్మిల కలిశారు. నర్సంపేట, హైదరాబాద్‌‌లో జరిగిన ఘటనలను వివరించారు. తర్వాత మీడియాతో షర్మిల మాట్లాడారు.

ఏ నేరం చేశామని రిమాండ్‌‌కు పంపుతరు

పాదయాత్రలో తమకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే దాడులు చేశారని, కేసీఆర్ పతనం మొదలైంది కాబట్టే ఇలా చేస్తున్నారని షర్మిల అన్నారు. ‘‘టీఆర్ఎస్ గూండాల దాడులను కేసీఆర్‌‌‌‌కు చూపేందుకే ప్రగతిభవన్‌‌కు బయల్దేరాం. కానీ పోలీసులు ఓవరాక్షన్ చేసి అడ్డుకున్నారు. తమ వాహనాలను అడ్డుపెట్టి ట్రాఫిక్ సమస్య పుట్టించారు. నేను వాహనంలో ఉండగానే ఒక మహిళ అని కూడా చూడకుండా క్రేన్ సాయంతో మమ్మల్ని తీసుకెళ్లారు. బలవంతంగా అరెస్ట్ చేశారు. మా మనుషులను తీవ్రంగా కొట్టారు. పోలీసులకు కొట్టే అధికారం ఎక్కడిది. మమ్మల్ని రిమాండ్‌‌కు తరలించాలని ప్రయత్నించారు. మేం ఏం నేరం చేశామని రిమాండ్‌‌కు పంపాలని చూశారు? రిమాండ్​కు పంపాల్సిన అవసరం కేసీఆర్​కు ఏముంది. జడ్జి కూడా ఇది అన్యాయమని చెప్పి, మాకు బెయిల్ మంజూరు చేశారు” అని వివరించారు. రాష్ట్రంలో దొరల పాలన సాగుతున్నదని ఆరోపించారు.

పాదయాత్ర చేస్తానంటే బెదిరిస్తున్నరు

‘‘నేను ఇక్కడే పుట్టా. ఇక్కడే చదువుకున్నా. నేను ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనే.. తెలంగాణ ఆడపడుచునే. కేటీఆర్ భార్యది ఏపీ కదా? ఆమె ఇక్కడ బతకడం లేదా? ఆమెను గౌరవిస్తున్నరు. నన్ను ఎందుకు గౌరవించరు? కేటీఆర్ నుంచి ఆమె విడాకులు తీసుకోవాలని కోరుతున్నారా?” అని షర్మిల ప్రశ్నించారు. పాదయాత్ర మళ్లీ స్టార్ట్ చేస్తానంటే టీఆర్ఎస్ లీడర్లు వరుస ప్రెస్ మీట్లు పెట్టి బెదిరిస్తున్నారని చెప్పారు. “ఎవడో బాల్క సుమన్ అట. మమ్మల్ని నల్లిని నలిపేసినట్టు నలిపేస్తాడట. లోటస్ పాండ్ నుంచి బయటకు రానీయడట. ఒక ఎంపీ కవితనట.. ఒక ఎమ్మెల్యే సునీతనట.. ప్రజలకు ఎప్పుడూ కనిపించని ముఖాలు ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి బెదిరిస్తున్నారు. ‘దాడులు జరిగితే మాకు సంబంధం లేదు.’ అంటున్నారు” అని తెలిపారు.

అఫ్గనిస్తాన్‌‌లా తెలంగాణ

తమ పాదయాత్ర శుక్రవారం నుంచి మొదలవుతుందని షర్మిల స్నష్టం చేశారు. దాడులు తప్పవని టీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్నారని పోలీసులకు చెబుతున్నామని, వారిని ముందే అదుపులోకి తీసుకుని రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. తనకు, తన వారికి ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కేసీఆర్‌‌‌‌దే అని స్పష్టం చేశారు. అఫ్గనిస్తాన్​గా తెలంగాణ మారిందని, తాలిబన్ అధ్యక్షుడిగా కేసీఆర్ మారాడని ఆరోపించారు.  ఉద్యమకారులను తరిమేసి టీఆర్ఎస్ నాయకులు తాలిబన్లలా మారారని, కేసీఆర్ పార్టీ నిండా తాలిబన్లేనని ఎద్దేవా చేశారు.

ప్రగతి భవన్‌‌లో రెయిడ్స్ చేయాలె

రాష్ట్రంలో 8 ఏండ్లలో వేల కోట్లను దోచుకున్న కేసీఆర్ కుటుంబంపై, ప్రగతి భవన్‌‌లో ఈడీ దాడులు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై దాడులు చేస్తే ఎంత దోచుకున్నరో ప్రజలకు అర్థమవుతుందని చెప్పారు. “కేసీఆర్ కుటుంబం ప్రాజెక్టుల పేరుతో రూ.వేల కోట్లు దోచుకుంది. బిడ్డ కవిత లిక్కర్ స్కామ్ లో దోచుకుంది. కొడుకు కేటీఆర్ బినామీల పేరుతో లక్ష కోట్లు సంపాదించారు.. రెయిడ్లు చేస్తే కేసీఆర్ కుటుంబం, ప్రగతిభవన్ మీద చేయాలి.. లక్షల కోట్లు బయటపడుతాయి. మునుగోడు, హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంత ఖర్చు చేసిందో విచారణ జరగాలి. ప్రతి టీఆర్ఎస్ నాయకుడిపై.. కేసీఆర్ ఫ్యామిలీ చేసిన ప్రతి స్కాంపై దర్యాప్తు జరగాలి” అని చెప్పారు.