ప్రాజెక్టులపై ఆంక్షలు పెడితే ఎందుకు ప్రశ్నించడం లేదు: సుదర్శన్ రెడ్డి

ప్రాజెక్టులపై ఆంక్షలు పెడితే ఎందుకు ప్రశ్నించడం లేదు: సుదర్శన్ రెడ్డి

నర్సంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు బహిరంగ లేఖ రాశారు. లేఖలో షర్మిలకు కొన్ని ప్రశ్నలు సంధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విభజన హామీలలో ఇప్పటివరకు అమలుకు నోచుకొని అంశాలపై తమ వైఖరి ఏంటో షర్మిల స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సీఎంకేసీఆర్ నాయకత్వంలో అనతికాలంలోనే కృష్ణా, గోదావరి నదులపై నిర్మించుకున్న ప్రాజెక్టులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరాలు తెలుపుతూ రాసిన లేఖ పట్ల  షర్మిల తమ వైఖరి చెప్పాలన్నారు. 

పోలవరం ప్రాజెక్టు పేరుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలుపుకోవడంతో పాటు పీలేరు జలవిద్యుత్ కేంద్రం విషయంలో కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటై తెలంగాణను మోసం చేశాయని.. దీనిపై షర్మిల వైఖరి తెలియజేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు. తెలంగాణ రైతుల కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం తెలుపుతూ లేఖ రాయడంతో కేంద్ర జలశక్తి మంత్రి ఆంక్షలు విధించారు. రాష్ట్ర ప్రాజెక్టులపై గతంలో బండి సంజయ్ కూడా కేంద్రానికి లేఖ రాశారని, ఈ ఇద్దరి లేఖల పట్ల తెలంగాణకు చేస్తున్న అన్యాయం పట్ల షర్మిల తన వైఖరి తెలియజేయాల డిమాండ్ చేశారు.  

కేంద్రం ఆంక్షలతో వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు దేవాదుల, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు.  ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అనేక పథకాల గ్రాంట్లకు కేటాయించాల్సిన రూ.40 వేల కోట్ల కోత విధించిందని..దీనిపైసరైన సమాధానం చెప్పాలన్నారు. 

విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలను బ్లాక్ మెయిల్ చేస్తే.. ఆ బ్లాక్ మెయిల్ కు తలొగ్గి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మోటర్లకు మీటర్లు బిగించలేదా..?దాన్ని సమర్ధిస్తున్నారా..? వ్యతిరేకిస్తున్నారా...? అని ప్రశ్నించారు. తన ప్రాణం ఉన్నంత వరకు రైతుల మోటర్లకు మీటర్లు పెట్టమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని లేఖలో వివరించారు. రైతుల పక్షాన నిలబడిన నేతను విమర్శిస్తూ.. రైతులకు అన్యాయం చేసేందుకు సిద్ధమైన వారిపై విమర్శలు చేయకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో స్పష్టం చేయాలన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యలు.. రెండు రాష్ట్రాల వాటాలపై కొర్రీలు పెడుతుంటే  ఏపీ ప్రభుత్వాన్ని నిలదీయగలరా..? అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు.