ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కే పట్టం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కే పట్టం

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ విజయ దుందుభి మోగించింది. ఆరుకు ఆరు స్థానాల్లో గెలిచి.. టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. మొత్తం 12 ఎమ్మెల్సీ  స్థానాలకు గత నెల 9వ తేదీన షెడ్యూల్​ విడుదలైంది. ఇందులో ఆరుస్థానాలు ఏకగ్రీవమయ్యాయి.  మిగిలిన ఆరింటిలో ఉమ్మడి కరీంనగర్‌‌ జిల్లాలో రెండు, ఆదిలాబాద్‌‌, ఖమ్మం, నల్గొండ, మెదక్‌‌ ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఈ నెల 10న పోలింగ్​ జరగగా 95 శాతం ఓటింగ్​ నమోదైంది. ఈ స్థానాలన్నింటిని టీఆర్ఎస్ సొంతం చేసుకుంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలు టీఆర్ఎస్ వశమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులుగా భాను ప్రసాద్ రావు, ఎల్. రమణ బరిలోకి దిగారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి.. ఇండిపెండెంట్ గా కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూడా బరిలో నిలిచారు. వీరితో పాటు మరో ఏడుగురు కూడా స్వతత్రులుగా పోటీ చేశారు. అయితే ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని రవీందర్ సింగ్ ప్రచారానికి దిగి అధికార పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. అయితే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మాత్రం టీఆర్ఎస్ వైపే మొగ్గుచూపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1324 ఓట్లకు గాను 1320 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థులు భాను ప్రసాద్ కు 584 ఓట్లు రాగా.. ఎల్. రమణకు 479 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ కు 232 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా ఈ జిల్లాలో 20 ఓట్లు చెల్లనివిగా తేలాయి. 

నల్గొండ జిల్లా నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంసీ కోటిరెడ్డి పోటీ చేయగా.. మరో ఆరుగురు స్వతత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. అయితే ఇండిపెండెంట్లలో నగేష్ అనే అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థికి కాస్త పోటీనిచ్చారు. ఇక్కడ మొత్తం 1271 ఓట్లుంటే.. వాటిలో 1233 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 1183 ఓట్లు చెల్లుబాటు కాగా.. 50 ఓట్లు చెల్లని ఓట్లుగా తేలాయి.  టీఆర్ఎస్ అభ్యర్థికి 917 ఓట్లు రాగా.. స్వతంత్ర అభ్యర్థి నగేష్ కు 226 ఓట్లు వచ్చాయి. ఈ స్థానంలో గెలవాలంటే 593 ఓట్లు అవసరం. అవసరానికి మించి ఓట్లు పోలవడంతో టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి 691 ఓట్ల మెజార్టీతో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచారు. 

మెదక్ జిల్లాలో బరిలో నిలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి ఒంటేరు యాదవరెడ్డి విజయం సాధించారు. ఈ స్థానం కోసం ముగ్గురు పోటీలో నిలిచారు. ఇక్కడ 1018 ఓట్లు పోలవ్వగా.. వీరిలో యాదవరెడ్డికి 762 ఓట్లు.. కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన తూర్పు నిర్మలా జగ్గారెడ్డికి 238 ఓట్లు పోలయ్యాయి. దాంతో 524 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇండిపెండెంట్ అభ్యర్థికి 2 ఓట్లు పడగా.. 12 ఓట్లు చెల్లనివిగా మిగిలాయి.

ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ గెలుపొందింది. ఈ స్థానానికి ఇద్దరు అభ్యర్థులు పోటీపడ్డారు. టీఆర్ఎస్ నుంచి దండే విఠల్ రెడ్డి పోటీ చేయగా.. ఇండిపెండెంట్ గా పుష్పరాణి బరిలో నిలిచారు. ఇక్కడ మొత్తం 862 ఓట్లు పోలయ్యాయి. వీటిలో విఠల్ రెడ్డికి 742 ఓట్లు రాగా.. స్వతంత్ర అభ్యర్థి పుష్పరాణికి 75 ఓట్లు పోలయ్యాయి. కాగా.. చెల్లని ఓట్లుగా 45 ఓట్లు రావడం గమనార్హం. మొత్తం మీద విఠల్ 667 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు గెలుపొందారు. ఈ స్థానానికి నలుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇద్దరు ఇండిపెండెంట్లు, టీఆర్ఎస్ నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి ఒకరు పోటీ పడ్డారు. ఇక్కడ మొత్తం 768 ఓట్లకు గాను 738 ఓట్లు పోలయ్యాయి. వీటిలో టీఆర్ఎస్ అభ్యర్థికి 486 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థికి 239 ఓట్లు వచ్చాయి. దాంతో టీఆర్ఎస్ అభ్యర్థి 247 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఇక్కడ భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు అంటున్నారు. కేవలం 116 ఓట్లు మాత్రమే ఉన్న కాంగ్రెస్ కు 239 ఓట్లు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దాదాపు 141 ఓట్లు క్రాస్ అయినట్లు తాతా అంటున్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.