వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం ముగింపే లక్ష్యంగా అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఈ తరుణంలో లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడటంతో ఇరాన్-అమెరికా పీస్ టాక్స్ మళ్లీ సందిగ్ధంలో పడ్డాయి. దీంతో ఇజ్రాయెల్ చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహును ఫోన్లో తీవ్రంగా మందలించినట్లు ప్రముఖ వార్తా వెబ్‌సైట్ ఆక్సియోస్ నివేదించింది.
ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేస్తున్నారని.. ఇరాన్‌తో అమెరికా దౌత్య ప్రయత్నాలకు ప్రమాదం కలిగిస్తున్నారని నెతన్యాహుపై ట్రంప్ సీరియస్ అయ్యారు. ప్రస్తుత పరిణామాలను పట్టించుకోకుండా పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నావని నెతన్యాహుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్. ‘‘నువ్వు అసలు ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా.. నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి.. నేను నిన్ను కాపాడుతున్నా. ఇప్పుడు అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు. నీవు పిచ్చివాడిలా తయారయ్యావు’’ అని నెతన్యాహుపై ట్రంప్ చిందులు తొక్కారు. లెబనాన్‌పై దాడులు కొనసాగితే అది ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్‌ను మరింత ఏకాకిని చేస్తుందని ట్రంప్ హెచ్చరించారు.
ఇరాన్ వార్నింగ్
తమ మిత్రదేశమైన లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలకు నిరసనగా అమెరికాతో కొనసాగుతున్న శాంతి చర్చల నుంచి వైదొలిగే అవకాశం ఉందని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు కీలక దశలో ఉన్న వేళ లెబనాన్‌పై దాడి చేసి పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలను పెంచడంపై ట్రంప్ సీరియస్‌గా ఉన్నారు. ట్రంప్ వార్నింగ్‌తో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గింది. లెబనాన్ పై దాడులను నిలిపివేసి.. తమ బలగాలను వెనక్కి రప్పించినట్లు తెలుస్తోంది.
