- పాక్ విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నం:
- యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్
- ఇరాన్ పోర్టుల దిగ్బంధం మాత్రం కొనసాగుతుందని ప్రకటన
- కాల్పుల విరమణకు ఇరాన్ అంగీకారం
- హార్మూజ్‌లో మూడు నౌకలపై ఐఆర్జీసీ కాల్పులు
- గుజరాత్‌కు వస్తున్న రెండు షిప్పులు కూడా సీజ్
- ఇరాన్ చర్చలకు రాకపోవడంతో జేడీ వాన్స్ పాక్ పర్యటన రద్దు
టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్‌తో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిరవధికంగా పొడిగిస్తున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ నాయకత్వంలో చీలికలు వచ్చాయనే వార్తల నేపథ్యంలో శాంతి చర్చలకు వారికి మరింత సమయం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్ తన ప్రతిపాదనలు సమర్పించే వరకు లేదా శాంతి చర్చలు ఏదో ఒక ముగింపునకు చేరే వరకూ సీజ్ఫైర్ కొనసాగిస్తామన్నారు.
పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన విజ్ఞప్తి మేరకు కాల్పుల విరమణను పొడిగించినట్లు ట్రంప్ వివరించారు. అమెరికా, ఇరాన్ మధ్య ఇంతకుముందు కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ గడువు బుధవారం నాటితో ముగిసిపోయింది. పాకిస్తాన్లో అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలు జరగకపోవడంతో గడువు ముగియడానికి ముందే తెల్లవారుజామున ట్రంప్ సీజ్ ఫైర్‌ను పొడిగించారు.
ఇరాన్‌పై దాడులను ఆపాలని ఈ చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ కోరినట్టు ట్రంప్ ఈ మేరకు తన ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు. అయితే, ఇరాన్ పోర్టుల దిగ్బంధం మాత్రం కొనసాగుతుందన్నారు. ‘‘దిగ్బంధం లేకుండా ఇరాన్‌తో ఎప్పటికీ ఒప్పందం కుదరదు. వారి దేశంలోని మిగిలిన భాగాలను, వారి నాయకులతో సహా మేం పేల్చివేస్తే తప్ప!’’ అని కామెంట్ చేశారు. కాగా, ఇరాన్‌తో చర్చలు పునఃప్రారంభించడానికి అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తన బృందంతో పాకిస్తాన్ వెళ్ళవలసి ఉండగా, ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. అమెరికా డిమాండ్లు అసమంజసంగా ఉన్నాయని పేర్కొంటూ ఇరాన్ ప్రతినిధి బృందం చర్చలకు రాకపోవడంతో ఆయన పర్యటన రద్దయింది.
సీజ్ ఫైర్ పొడిగింపునకు ఇరాన్ ఓకే
కాల్పుల విరమణ పొడిగింపును ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ అంగీకరించినట్లు బుధవారం ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ వెల్లడించింది. అయితే, ఇస్లామాబాద్‌లో అమెరికాతో మరో రౌండ్ చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని మాత్రం ఆయన చెప్పలేదని తెలిపింది. "జాతీయ ప్రయోజనాలను, భద్రతను కాపాడటానికి దౌత్యం ఒక సాధనం. జాతీయ ప్రయోజనాలను సాధించడానికి, శత్రువుల దుష్ట లక్ష్యాలను అడ్డుకోవడంలో ఇరాన్ సాధించిన విజయాలను ఏకీకృతం చేయడానికి ఈ సాధనాన్ని ఉపయోగించడానికి అవసరమైన, సహేతుకమైన పరిస్థితులు ఉన్నాయని మేం నిర్ధారణకు వచ్చినప్పుడల్లా చర్యలు తీసుకుంటాము" అని ఆయన అన్నట్లు పేర్కొంది.
గుజరాత్ వస్తున్న 2 కార్గో నౌకలు సీజ్
హార్మూజ్ జలసంధి గుండా గుజరాత్‌కు వస్తున్న రెండు కార్గో నౌకలను ఇరాన్ నౌకాదళం బుధవారం స్వాధీనం చేసుకుంది. ‘‘నిబంధనలు ఉల్లంఘించిన రెండు నౌకలు, ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న, పనామా జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంఎస్‌సీ ఫ్రాన్సిస్కా’, లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎపామినోడ్స్’ అనే షిప్పులను ఐఆర్జీసీ నౌకాదళం స్వాధీనం చేసుకుని ఇరాన్ తీరానికి చేర్చింది.
ఈ నౌకలు అనుమతులు లేకుండా నడుస్తున్నాయని, నావిగేషన్ వ్యవస్థలను తారుమారు చేస్తూ సముద్ర భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని గుర్తించాం. ప్రస్తుతం ఈ నౌకలు ఇరాన్ జలాల్లో ఉన్నాయి. వాటిలోని సరుకు, రికార్డులు తనిఖీ చేస్తున్నాం’’ అని ఇరాన్ నేవీ తెలిపింది. ట్రంప్ కాల్పుల విరమణను పొడిగించిన కొద్ది గంటలకే ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రీస్‌కు చెందిన ‘యుఫోరియా’ అనే నౌకను కూడా ఐఆర్జీసీ టార్గెట్ చేసిందని.. అది ప్రస్తుతం ఇరాన్ తీరం సమీపంలో చిక్కుకుపోయిందని అక్కడి మీడియా వెల్లడించింది.
ఇరాన్ నాయకత్వంలో చీలికలు!
శాంతి చర్చల అంశంలో ఇరాన్ సుప్రీం లీడర్ గా మొజ్తబా ఖమేనీ నిర్ణయం తీసుకునే స్థితిలో లేనందుకే చర్చల ప్రక్రియలో జాప్యం ఏర్పడుతోందని అమెరికా అధికారులు భావిస్తున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ గా మొజ్తబా పేరును ప్రకటించి ఆరు వారాలు దాటినా ఆయన ఇప్పటివరకూ బహిరంగంగా కనిపించలేదు. మొజ్తబా పేరుతో ప్రకటనలు రావడం తప్ప.. ఆయన కనీసం నేరుగా టీవీలోనూ మాట్లాడలేదు. దీంతో ఇజ్రాయెల్, అమెరికా తొలిరోజు జరిపిన దాడిలోనే తన తండ్రి సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చనిపోగా, మొజ్తబా తీవ్రంగా గాయపడ్డారని, తర్వాత మొజ్తబాను సుప్రీం లీడర్ గా ప్రకటించినా.. ఆయన పాలనా పగ్గాలు చేపట్టే స్థితిలో లేరన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఒకవైపు సుప్రీం లీడర్ క్రియాశీలకంగా లేకపోవడంతో మరోవైపు ఇరాన్ నాయకత్వంలో చీలికలు వచ్చాయని.. అందుకే ఇరాన్ వైఖరిపై లేదా అణు కార్యక్రమ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలపై చర్చల ప్రతినిధులకు ఎంత మేర అధికారం ఇవ్వాలనే విషయంలో నాయకుల మధ్య స్పష్టమైన ఏకాభిప్రాయం లేదని ‘సీఎన్ఎన్’ మీడియా సంస్థ ఓ కథనంలో పేర్కొంది. మొజ్తబా తన కింది అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారా లేదా వారు నిర్దిష్ట సూచనలు లేకుండా ఆయన ఏం కోరుకుంటున్నారో ఊహించి వ్యవహరిస్తున్నారా? అనేది ఈ సంక్లిష్టతకు కారణమని ట్రంప్ బృందం భావిస్తున్నట్టు తెలిపింది.

