అమెరికా చైనా మధ్య ఆర్థిక యుద్ధం మరోసారి ముదిరింది. ఇరాన్ చమురు ఎగుమతులపై ఉక్కుపాదం మోపే క్రమంలో భాగంగా.. చైనాకు చెందిన అతిపెద్ద ఆయిల్ రిఫైనరీతో పాటు సుమారు 40 షిప్పింగ్ కంపెనీలు, ట్యాంకర్లపై ట్రంప్ ప్రభుత్వం ఆర్థిక ఆంక్షలను విధించింది. ఇరాన్ ఆదాయ వనరులను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికాలోని రిపబ్లికన్ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
చైనా రిఫైనరీపై వేటు..
ఆంక్షల్లో ప్రధానంగా చైనాలోని దాలియన్ నగరంలో ఉన్న 'హెంగ్లీ పెట్రోకెమికల్' కేంద్రాన్ని అమెరికా టార్గెట్ చేసింది. రోజుకు 4 లక్షల బారెళ్ల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం ఉన్న ఈ రిఫైనరీ.. చైనాలోనే అతిపెద్ద ఇండిపెండెంట్ రిఫైనరీల్లో ఒకటి. 2023 నుండి ఈ సంస్థ ఇరాన్ నుంచి క్రూడ్ దిగుమతి చేసుకుంటూ.. ఇరాన్ మిలిటరీకి భారీగా ఆదాయాన్ని చేకూరుస్తోందని అమెరికా ట్రెజరీ విభాగం ఆరోపించింది.
సెకండరీ శాంక్షన్స్ హెచ్చరిక..
ఇరాన్ చమురు రవాణాకు సహకరిస్తున్న నౌకలు, మధ్యవర్తులు, కొనుగోలుదారుల నెట్‌వర్క్‌ను పూర్తిగా అడ్డుకుంటామని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. చైనా, హాంకాంగ్, యూఏఈ, ఒమన్ వంటి దేశాల్లోని ఆర్థిక సంస్థలకు ఇప్పటికే అమెరికా హెచ్చరిక లేఖలు పంపింది. ఇరాన్ డబ్బును తమ బ్యాంకుల్లో ఉంచుకున్నా లేదా వారితో వ్యాపారం చేసినా సెకండరీ శాంక్షన్స్ ఎదుర్కోవాల్సి ఉంటుందని బెసెంట్ హెచ్చరించారు.
ప్రపంచ ఇంధన సంక్షోభం..
ఒకవైపు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి తోడు అమెరికా స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ వద్ద బ్లాకేడ్ ఏర్పాటు చేసింది. అయితే పెరుగుతున్న చమురు ధరల నుంచి ఉపశమనం పొందేందుకు రష్యా చమురుపై కొన్ని తాత్కాలిక మినహాయింపులు ఇచ్చినా.. చైనా-ఇరాన్ డీలింగ్స్ విషయంలో మాత్రం ట్రంప్ సర్కార్ ఏమాత్రం తగ్గడం లేదు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ కావడానికి కేవలం కొన్ని వారాల ముందే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అటు వెనిజులా నుంచి ఇటు ఇరాన్ నుంచి చమురు ఆగిపోవటంతో చైనా ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెట్టేస్తున్నాడు ట్రంప్.

