- ట్రంప్ కీలక నిర్ణయం.. గంజాయి
- అమెరికాలో పెయిన్ కిల్లర్‌గా గంజాయి
- షెడ్యూల్-3 డ్రగ్‌గా గుర్తిస్తూ ట్రంప్ ఉత్తర్వులు
- స్వల్ప మొత్తంలో గంజాయి నిల్వ చేసుకునే వీలు
వాషింగ్టన్: అమెరికాలో గంజాయి వినియోగానికి సంబంధించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ జాబితాలో ఉన్న గంజాయిని.. ఇప్పుడు తక్కువ ప్రమాదకరమైన ఔషధాల విభాగంలోకి మారుస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఫెడరల్ చట్టాల ప్రకారం.. గంజాయి షెడ్యూల్-1 జాబితాలో ఉండేది. అంటే హెరాయిన్, ఎల్ఎస్డీ వంటి ప్రాణాంతక మత్తుపదార్థాలతో సమానంగా దీన్ని పరిగణించేవారు.
తాజా ఉత్తర్వులతో ఇది షెడ్యూల్-3 జాబితాలోకి చేరుతుంది. దీనివల్ల గంజాయి ఇప్పుడు కోడైన్ కలిగిన టైలెనాల్ వంటి సాధారణ పెయిన్ కిల్లర్ మందుల సరసన చేరుతుంది. గంజాయిపై శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించడమే ఈ మార్పు వెనుక ప్రధాన ఉద్దేశమని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక నొప్పులు (క్రోనిక్ పెయిన్), ఇతర అనారోగ్య సమస్యల చికిత్సలో గంజాయి, సీబీడీ ప్రయోజనాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేయడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని వివరించాయి.
కాగా..ఫెడరల్ స్థాయిలో గంజాయికి వైద్యపరమైన విలువ ఉందని అమెరికా ప్రభుత్వం అధికారికంగా గుర్తించడం ఇదే మొదటిసారి. ఈ నిర్ణయం వల్ల వైద్యులు, రోగుల మధ్య గంజాయి వినియోగంపై స్పష్టమైన అవగాహన పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వ్యక్తిగత వినియోగం కోసం చిన్న మొత్తంలో గంజాయిని కలిగి ఉన్నందుకు ఎవరినీ అరెస్టు చేయకూడదని ట్రంప్ చెప్పినప్పటికీ.. ఫెడరల్ చట్టాల ప్రకారం ఇది ఇంకా నిషేధిత పదార్థమే.

