- ఆపాలంటూ సీరియస్ నువ్వు పిచ్చోడివి..
- నిన్ను అందరూ ద్వేషిస్తున్నారు
- హెజ్బొల్లాపై దాడుల వల్ల ఇరాన్‌తో డీల్‌కు ఆటంకం కలుగుతోంది
వాషింగ్టన్: లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్లపై ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్‌తో అమెరికా శాంతి చర్చలకు విఘాతం కలుగుతోందని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫైర్ అయ్యారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్ లో మాట్లాడిన ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారని ఈ మేరకు అమెరికన్ మీడియా సంస్థ ‘ఆక్సియోస్’ మంగళవారం ఓ కథనంలో వెల్లడించింది. వాడివేడిగా జరిగిన ఈ ఫోన్ సంభాషణలో నెతన్యాహును ‘‘నువ్వు పిచ్చివాడివి.. కృతజ్ఞత లేనివాడివి’’ అంటూ ఆయన మండిపడ్డారని తెలిపింది. లెబనాన్ లో ఇరాన్ ప్రాక్సీ మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడుల వల్ల .. శాంతి చర్చలకు ఆటంకం ఏర్పడుతోందని ట్రంప్ సీరియస్ అయినట్టు పేర్కొంది.
లెబనాన్ రాజధాని బీరుట్ నగరంపై దాడి చేయాలనే ఇజ్రాయెల్ ప్రణాళికకు ట్రంప్ బ్రేకులు వేసినట్లు ఆ పత్రిక పేర్కొంది. బీరుట్ పై బాంబులు వేస్తామంటూ ఇజ్రాయెల్ చేస్తున్న హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా ఆ దేశాన్ని మరింత ఒంటరిని చేస్తాయని నెతన్యాహుకు ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. నెతన్యాహు అవినీతి ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న సమయంలో తాను మద్దతు ఇచ్చానని.. లేకపోతే ఆయన జైలుకు పోయేవాడని కూడా ట్రంప్ గుర్తు చేసినట్టు తెలుస్తోంది. ‘‘ఇప్పుడు అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు. దీనివల్ల ఇజ్రాయెల్ దేశాన్ని కూడా అందరూ ద్వేషిస్తున్నారు’’ అని ట్రంప్ అన్నట్టు ఆక్సియోస్ పేర్కొంది. ఒకానొక దశలో నెతన్యాహుపై ట్రంప్ తీవ్ర కోపానికి గురై,‘‘నువ్వు అసలు ఏం చేస్తున్నావు?”అని ప్రశ్నించినట్లు తెలిపింది. కాగా, లెబనాన్ లో దాడులను తీవ్రం చేయాలనే నెతన్యాహు నిర్ణయం.. ఇరాన్ తో తాను జరుపుతున్న చర్చలను దెబ్బతీసేలా ఉండటంపై ట్రంప్ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. లెబనాన్ పౌరులు చాలామంది ప్రాణాలు కోల్పోతుండటంపై అమెరికా అధ్యక్షుడు ఆందోళన చెందుతున్నారని, కేవలం ఒక్క హెజ్బొల్లా కమాండర్ ను హతం చేయడం కోసం భవనాలను కూల్చివేయాలనే ఇజ్రాయెల్ ప్రణాళికను ఆయన వ్యతిరేకించారని అమెరికా వర్గాలు తెలిపాయని ఆక్సియోస్ పేర్కొంది.
సీజ్ ఫైర్‌కు ఇరుపక్షాలూ అంగీకరించినయ్..
ఫోన్ కాల్ అనంతరం ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా స్పందించారు. నెతన్యాహుతో సానుకూల చర్చలు జరిగాయని తెలిపారు. ఇకపై ఇజ్రాయెల్ దళాలు బీరుట్ వైపు వెళ్లవన్నారు. ‘‘నేను ఈ రోజు బీబీ(నెతన్యాహు)తో మాట్లాడాను. బీరుట్ పై పెద్ద ఎత్తున దాడికి వెళ్లవద్దని కోరాను. ఆయన తన దళాలను వెనక్కి తిప్పారు. ధన్యవాదాలు బీబీ!”అని ట్రంప్ పేర్కొన్నారు. ‘‘హెజ్బొల్లా ప్రతినిధులతో కూడా మాట్లాడాను. ఇజ్రాయెల్ పై కాల్పులు ఆపేందుకు వారు అంగీకరించారు. అదేవిధంగా వారిపై కాల్పులు జరపడం ఆపేందుకు ఇజ్రాయెల్ కూడా అంగీకరించింది. ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను” అని తెలిపారు. ఆ తర్వాత నెతన్యాహు కూడా ఈ సంభాషణను ధృవీకరించారు. కానీ దీనిని నియంత్రణగా కాకుండా హెచ్చరికగా పేర్కొన్నారు. హెజ్బొల్లా దాడులు ఆగకపోతే బీరుట్ లోని లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుందని తాను ట్రంప్ కు చెప్పినట్లు వెల్లడించారు.
