- అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్
- ప్రధానిగా మోదీ ఉన్నంతకాలం తోడుంటం
- ఆయనో గొప్ప లీడర్ అంటూ ప్రశంసలు
- జీ7 సమిట్ సైడ్ లైన్స్‌లో మోదీ, ట్రంప్ భేటీ
- నావికుల భద్రతకు ప్రాధాన్యమివ్వండి
- ట్రంప్ కు ప్రధాని మోదీ విజ్ఞప్తి
- పీస్ డీల్‌లో అవసరమైన చర్యలు తీస్కోండి
- శాంతి కోసం ట్రంప్ యంత్రాంగం
- కృషిని మెచ్చుకున్న మోదీ
ఎవియాన్ (ఫ్రాన్స్): ‘‘ఇండియా, అమెరికాల మధ్య ఎలాంటి రక్షణ ఒప్పందం లేదు.. అయినప్పటికీ ఇండియాపై ఏ దేశమైనా దాడిచేస్తే అమెరికా వెంటనే సాయంగా వస్తుంది. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు ఆ స్థాయిలో ఉన్నాయి” అని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. నరేంద్ర మోదీ దేశాన్ని లీడ్ చేస్తున్నంత వరకు ఇండియాపై ఎలాంటి దాడి జరిగినా అమెరికా సాయంచేస్తుందని చెప్పారు. మోదీ స్థానంలోకి వేరే వ్యక్తి వస్తే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేమని వ్యాఖ్యానించారు. అమెరికాకు తాను ప్రెసిడెంట్ గా ఉన్నంతకాలం ‘వైట్ హౌస్’ లో ఇండియాకు ప్రత్యేక స్థానం ఉంటుందని ట్రంప్ తెలిపారు. త్వరలో తాను ఇండియాలో పర్యటిస్తానని చెప్పారు. ఈమేరకు ఫ్రాన్స్ లో జరుగుతున్న జీ7 సమిట్వేదికగా బుధవారం ట్రంప్, మోదీల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భారత్-అమెరికా రక్షణ బంధం, పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్) సంక్షోభం, నావికుల భద్రత వంటి పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ నావికుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. భారత నావికులు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, నౌకలపై విధులు నిర్వహిస్తున్నారని, వారందరి బాధ్యతకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ట్రంప్ ను కోరారు. ఇరాన్‌తో కుదిరిన పీస్ డీల్ లో నావికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు.
మోదీపై ట్రంప్ ప్రశంసలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ అందంగా, దేవదూతలా కనిపిస్తారు కానీ వర్తకం విషయంలో ఆయన చాలా గట్టిగా, పట్టుదలతో వ్యవహరిస్తారని డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘మోదీ చాలా కఠినమైన సంప్రదింపులు జరుపుతారు. ఒక దేవదూతలా చాలా మంచిగా కనిపిస్తారు. కానీ వాస్తవానికి ఆయన ఒక కిల్లర్ అంత కఠినమైన వ్యక్తి. చాలాచక్కగా కనిపిస్తూనే అందరినీ ఆశ్చర్యపరుస్తారు. అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య త్వరలో ట్రేడ్ డీల్ కుదరనుందని, అమెరికాలో ఇండియా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతుందని ఆయన తెలిపారు. కాగా, పశ్చిమ ఆసియాలో శాంతి పునరుద్ధరణకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని మోదీ అభినందించారు.
ఇండో-యూఎస్ బంధంలో సరికొత్త వేగం
అమెరికా, ఇండియాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ట్రంప్ తో తాను గతేడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్లో భేటీ అయ్యానని, అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాల్లో సరికొత్త శక్తి సమకూరిందని చెప్పారు. ‘అనేక విషయాల్లో ఇండియా, అమెరికా కలిసి ముందుకు సాగుతున్నాయి. రెండు దేశాల బృందాలు ఉమ్మడిగా నిర్దేశించుకున్న లక్ష్యాలను రీచ్ అయ్యేందుకు వేగంగా ప్రయత్నిస్తున్నాయి’ అని ప్రధాని అన్నారు. కాగా, ఇటీవల హార్మూజ్ జలసంధి చుట్టుపక్కల జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో నావికుల భద్రత అంశాన్ని ప్రధాని మోదీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వద్ద ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్త నావికులలో 10 శాతం మంది భారతీయులేనని చెప్పారు. ఇరాన్ తో శాంతి ఒప్పందంలో నావికుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన హార్మూజ్ జలసంధిని ఎప్పుడూ తెరిచే ఉంచాలని, అక్కడ స్వేచ్ఛా నౌకాయానాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉందని మోదీ నొక్కి చెప్పారు. మరోవైపు, భారత నావికుల మరణాలపై ట్రంప్ స్పందిస్తూ.. వారి మరణాల గురించి తనకు సమాచారం ఉందన్నారు. నావికుల వృత్తి అత్యంత కఠినమైనదని చెప్పారు. ఆ నావికులంటే మాకు ఎంతో గౌరవం, ప్రేమ ఉన్నాయి. వారి రక్షణ, భద్రతకు సంబంధించి అమెరికా, ఇండియా కలిసి పనిచేస్తాయని వివరించారు.
