ఈ నెల 24, 25 తేదీల్లో మన దేశ పర్యటన ఖరారు
వాషింగ్టన్: యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 24, 25 తేదీల్లో మన దేశంలో పర్యటించనున్నారు. ఈ మేరకు వైట్‌హౌస్ మంగళవారం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఢిల్లీ, అహ్మదాబాద్‌లో ఆయన పర్యటన కొనసాగనుందని, అనేక అంశాల్లో రెండు దేశాల మధ్య బంధాలు బలోపేతం అయ్యేలా ట్రంప్ పర్యటన ఉంటుందని వైట్‌హౌస్ మీడియా సెక్రటరీ స్టెఫానీ గ్రీషమ్ పేర్కొన్నారు. ట్రంప్ వెంట ఆయన భార్య మెలానియా కూడా ఇండియాకు వస్తున్నారు. గతం వారం ప్రధాని నరేంద్ర మోడీ, ట్రంప్ ఫోన్‌లో మాట్లాడుకున్నారని, ఆ తర్వాతే పర్యటన ఖరారైందని గ్రీషమ్ తెలిపారు. ఈ పర్యటన రెండు దేశాల ప్రజల మధ్య స్నేహ భావాన్ని పెంచుతుందన్నారు. ట్రంప్ టూర్‌ను వ్యాపార వర్గాలు స్వాగతిస్తున్నాయి.
కొన్నాళ్లుగా తలెత్తిన వాణిజ్య విభేదాలు ఈ పర్యటనతో సమసిపోతాయని భావిస్తున్నాయి. రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరుగుతాయని ఆశిస్తున్నట్టు యుఎస్– –ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్టనర్‌షిప్ ఫోరం ప్రెసిడెంట్ ముఖేష్ అగి తెలిపారు. అమెరికా ప్రెసిడెంట్ హోదాలో ట్రంప్ ఇండియాకు రావడం ఇదే తొలిసారి. గతంలో 2010, 2015లో ప్రెసిడెంట్‌గా ఉన్న బరాక్ ఒబామా మన దేశంలో పర్యటించారు. ప్రధాని మోడీ గత సెప్టెంబర్‌లో అమెరికాలో పర్యటించారు. ఆ సందర్భంగా హోస్టన్‌లో సుమారు 50 వేల మంది ఇండియన్ అమెరికన్స్ పాల్గొన్న ‘హౌడీ మోడీ’ కార్యక్రమంలో ప్రసంగించి మోడీ ఆకట్టుకున్నారు. అంతకు ముందు ఆగస్టులో ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సమ్మిట్‌లో ట్రంప్, మోడీ కలుసుకున్నారు. ఈ రెండు సందర్భాల్లోనూ ట్రంప్‌ను ప్రధాని మోడీ ఇండియాకు ఆహ్వానించారు.

