కాంట్రాక్ట్​ ఏఎన్​ఎంలకు నాలుగు నెలలుగా జీతాల్లేవ్​

కాంట్రాక్ట్​ ఏఎన్​ఎంలకు నాలుగు నెలలుగా జీతాల్లేవ్​

18 ఏండ్లుగా గొడ్డు  చాకిరీ చేయించుకుంటున్న సర్కారు

జాబ్లు రెగ్యులర్ కాకపాయె.. ట్రాన్స్ఫర్లు లేకపాయె..

కరోనా టైంలోనూ అలవెన్సులు ఇయ్యలే..టైంకు జీతాలు రావట్లే

యూరోపియన్ స్కీమ్ కింద ఎంపికైన ఏఎన్ ఎం ల గోస

 

కరీంనగర్, వెలుగు: హెల్త్డిపార్ట్మెంట్లో యూరోపియన్ స్కీమ్ కింద ఎంపికైన ఏఎన్ఎంల పరిస్థితి అధ్వానంగా ఉన్నది. 12 నుంచి 18 ఏండ్లుగా రెగ్యులర్ ఏఎన్ఎంల లెక్కనే డ్యూటీ చేస్తున్నా, వాళ్లలాగే పనిభారం మోస్తున్నా, జీతాల్లో మాత్రం భారీ తేడా కనిపిస్తోంది. కరోనా టైంలో గొడ్డుచాకిరీ చేసినా ఎలాంటి అలవెన్సులూ ఇవ్వలేదని, దశాబ్దాలు గడుస్తున్నా రెగ్యులరైజ్ చేయట్లేదని అంటున్నారు. ఇప్పటివరకు ట్రాన్స్ఫర్లు లేక జాయిన్ అయిన చోటే ఉంటున్నామని, ఇదంతా పాలసీ మ్యాటర్అని సరిపెట్టుకున్నా కనీసం జీతాలైనా నెలనెలా ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అన్ని అర్హతలు ఉన్నా..

యూరోపియన్ స్కీమ్ కింద 2003, 2009లో రెండుసార్లు తెలంగాణ వ్యాప్తంగా సుమారు 720 మంది ఏఎన్ ఎం లను రాతపరీక్ష ద్వారా రిక్రూట్ చేశారు. రెగ్యులర్ ఏఎన్ఎంలకు ఉన్న అన్ని అర్హతలు వీళ్లకున్నా, వారి స్థాయిలో జీతాలు, ఉద్యోగ భద్రత  మాత్రం కల్పించడం లేదు. కాంట్రాక్ట్ పద్ధతిలో జాయిన్ అయిన ఏఎన్ఎంలంతా ఆయా పీహెచ్సీల పరిధిలో రెగ్యులర్ ఏఎన్ ఎం లు చేస్తున్న అన్ని రకాల సేవలు అందిస్తున్నారు. గర్భవతులు, బాలింతల నమోదు, టీకాలు  వేయడం, ఇతరత్రా సలహాలు, సూచనలివ్వడం వీళ్ల డ్యూటీ. ఈ పనులతో పాటు రెగ్యులర్ గా సర్వేలు, డాటా కలెక్షన్,వివరాలను అప్ లోడ్  చేయడం వంటి పనులు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో కాంట్రాక్ట్ ఏఎన్ఎంలందరినీ రెగ్యులరైజ్ చేస్తామని ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు అనేకసార్లు హామీ ఇచ్చినా చేయలేదు. డ్యూటీ లో చేరినచోటే  ఏండ్లుగా పని చేస్తున్నారు. జీతాల్లో పెరుగుదల, ట్రాన్స్ ఫర్లు లేకపోవడంతో తీవ్రస్థాయిలో సఫర్ అవుతున్నారు.

జీతాలు ఎప్పుడొస్తయే తెల్వది..

కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ అయిన ఏఎన్ఎంలకు చాలా ఏండ్ల తర్వాత నెల జీతం రూ. 21వేలు చేశారు. కానీ హెచ్ఆర్ ఏ, డీఏ, ఫీల్డ్ అలవెన్స్ లు ఇవ్వట్లేదు. ఆ జీతాలు కూడా నెలనెలా సక్రమంగా రావట్లేదు. ఒక్కోసారి ఆరు నెలల దాకా సాలరీస్ అందకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని కాంట్రాక్ట్ఏఎన్ఎంలు అంటున్నారు.  కరీంనగర్ జిల్లాలో వీళ్లకు నాలుగు నెలల నుంచి జీతాలు రావట్లేదు. వరంగల్, సిద్దిపేట, సిరిసిల్ల వంటి జిల్లాల్లో అయితే ఏకంగా ఏడు నెలల నుంచి సాలరీస్ అందలేదు. తెలంగాణ రాగానే కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో ఇక తమ కష్టాలు తీరినట్లేనని కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు భావించారు. కానీ తెలంగాణ వచ్చి ఏడేండ్లవుతున్నా వీరిని రెగ్యులర్ చేయట్లేదు.  ఈ విషయమై ప్రజాప్రతినిధులను, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ  ఉన్నతాధికారులను కలిసి విన్నవించినా పెద్దగా స్పందన లేకుండా పోయిందని అంటున్నారు. వెంటనే తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసి, ట్రాన్స్ఫర్లు చేయాలని కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

నెలనెలా సాలరీస్ ఇయ్యాలె..

2009లో  డ్యూటీలో చేరినం.  అప్పటి నుంచిహెల్త్ డిపార్ట్మెంట్లో ఏఎన్ఎం లతో సమానంగా విధులు నిర్వహిస్తున్నం. ఇటీవల కరోనా టైంలోనూ ఎక్కడ డ్యూటీ వేసినా, మా కుటుంబాలకు ప్రమాదమని తెలిసినా సేవలు అందించినం. ఇంతచేసినా ఇటు ఆఫీసర్లుగానీ, అటు ప్రభుత్వం గానీ స్పందించకపోవడం బాధగా ఉంది. నాలుగు నెలలుగా జీతాలు రాక ఫ్యామిలీలను పోషించుకోలేకపోతున్నం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నెల నెలా సాలరీస్ ఇవ్వాలె. ప్రణీత, తిమ్మాపూర్, కరీంనగర్

మా సేవలకు గుర్తింపు లేదు..

 18 ఏండ్ల కిందటే మాకు  అపాయింట్ మెంట్ ఇచ్చారు.  గర్భిణుల నమోదు, డెలివరీల దగ్గరి నుంచి గ్రామాల్లో అన్ని రకాల వైద్య సేవలు చేయించుకుంటున్నారు.   ఎంత చాకిరీ చేసినా రెగ్యులర్ ఉద్యోగులుగా ట్రీట్ చేయట్లేదు. ఇప్పటికైనా మా సేవలను ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. నెలనెలా సాలరీస్ అందించాలి.–శివ కుమారి,  కరీంనగర్