మున్సిపోల్స్ వచ్చే ఏడాదే!

మున్సిపోల్స్ వచ్చే ఏడాదే!
  • హైకోర్టులో క్లియరెన్స్‌‌‌‌కు నెలపైగా పడుతుందని సమాచారం
  • వీలైతే ఫిబ్రవరిలో లేదంటే గ్రేటర్‌‌‌‌తో కలిపి జూన్‌‌‌‌ తర్వాతే?
  • అప్పటి వరకు స్పెషల్​ ఆఫీసర్ల పాలనే

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మున్సిపల్‌‌‌‌ ఎన్నికలపై సర్కారు వెనుకడుగు వేస్తోంది. ఈ నెలలోనే పోలింగ్‌‌‌‌ పూర్తి చేయాలని మొదట్లో హడావుడి చేసినా ఇప్పుడు వెనక్కి తగ్గింది. మున్సిపల్​ఎన్నికలకు సంబంధించి హైకోర్టులోని కేసులు క్లియర్​ కావడానికి నెలపైగా పడుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీలైతే ఫిబ్రవరిలో లేదంటే గ్రేటర్​తో కలిపి జూన్​తర్వాత ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. అప్పటి వరకూ మున్సిపాల్టీల్లో స్పెషల్​ ఆఫీసర్ల పాలనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

తేలని హైకోర్టు కేసులు

మున్సిపాల్టీల్లో వార్డుల విభజన అశాస్త్రీయంగా ఉందంటూ పలువురు హైకోర్టుకు వెళ్లడంతో 71 మున్సిపాల్టీలు, ఆరు కార్పొరేషన్లలో ఎన్నికలపై సింగిల్‌‌‌‌ జడ్జి స్టే ఇచ్చారు. న్యాయ ప్రక్రియ పూర్తవడానికి నెల రోజులకుపైగా సమయం పడుతుందని ఓ అధికారి తెలిపారు. హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ ఉపఎన్నికల్లో భారీ విజయంతో మున్సిపోల్స్‌‌‌‌కు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఆసక్తి చూపింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చడం, చలో ట్యాంక్‌‌‌‌బండ్‌‌‌‌ లో పోలీసుల లాఠీచార్జీలో ఎక్కువ మంది కార్మికులు గాయపడటంతో వారిపై సానుభూతి పెరిగిందని ఇంటెలిజెన్స్‌‌‌‌ వర్గాలు ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టుగా తెలిసింది. ప్రైవేట్‌‌‌‌ బస్సుల్లో చార్జీలపై జనం ఆందోళనగా ఉన్నారని నివేదించినట్టుగా సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపల్‌‌‌‌ ఎన్నికలకు పోతే ప్రతికూల ఫలితాలు వస్తాయేమోననే వెనక్కి తగ్గినట్టు ప్రచారం జరుగుతోంది.

వచ్చే ఏడాదే ఎన్నికలు

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మున్సిపల్‌‌‌‌ ఎన్నికలు నిర్వహించే చాన్స్‌‌‌‌ ఉందని ప్రభుత్వ, పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాకపోతే జీహెచ్‌‌‌‌ఎంసీకి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోందని, గ్రేటర్‌‌‌‌తో కలిపే మిగతా కార్పొరేషన్లు, మున్సిపాల్టీలకు జూన్‌‌‌‌ , ఆ తర్వాతగానీ ఎన్నికలు జరిగే అవకాశముందని తెలుస్తోంది. ఆలోగా పరిస్థితులు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు అనుకూల మారతాయని ప్రభుత్వ పెద్దలు అంచనా వేస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వం ఎప్పుడు చెప్తే అప్పుడు ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు. అనుమతి ఇస్తే వారం రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని అంటున్నారు. ప్రభుత్వపరంగా ఇప్పటికైతే తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు.

TS government is backing down on municipal elections