పిల్లల మిస్సింగ్​ కేసులను ఎట్ల మూస్తరు?

పిల్లల మిస్సింగ్​ కేసులను ఎట్ల మూస్తరు?
  • వాళ్లు దేశ వ్యతిరేకశక్తులైతే ఏం చేస్తరు..
  • హైకోర్టు సీరియస్సర్కార్​ వైఖరి ఏంటో చెప్పాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగుకనిపించకుండా పోయిన పిల్లల కేసుల్ని పోలీసులు మూసేస్తే ఎలా అని హైకోర్టు సీరియస్​ అయింది. ఆ పిల్లలు దేశ వ్యతిరేక శక్తుల చేతుల్లో పెరిగి సమాజానికి చెడు చేయరన్న గ్యారెంటీ ఏంటని ప్రశ్నించింది. పిల్లల మిస్సింగ్​ కేసుల్లో సర్కారు వైఖరి ఏంటని ప్రశ్నించింది. నాలుగేళ్లలో ఎంత మంది పిల్లలు మిస్సయ్యారు.. ఎంత మంది ఆచూకీ దొరకింది.. దొరికిన పిల్లలను హోంలలో ఎట్ల ఉంచుతున్నారు.. వాళ్లకు అందిస్తున్న సౌకర్యాలు, భద్రత ఏమిటో చెప్పాలని సర్కారును ఆదేశించింది. భిక్షాటన చేసే పిల్లలు ఎవరు.. వేరే రాష్ట్రాల పిల్లలూ అందులో ఉన్నారా వంటి విషయాలను కౌంటర్​లో తెలియజేయాలని హోంశాఖ ముఖ్య  కార్యదర్శి, డీజీపీలకు ఆదేశాలిచ్చింది. పిల్లల మిస్సింగ్​ కేసులను మధ్యలోనే క్లోజ్​ చేసేస్తున్నారని, సమగ్ర దర్యాప్తు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ లాయర్​ రాపోలు భాస్కర్​ వేసిన పిటిషన్​ను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఆర్​ఎస్​ చౌహాన్​, జస్టిస్​ అభిషేక్​ రెడ్డిల డివిజన్​ బెంచ్​ విచారించింది.

‘‘పిల్లల ప్రాథమిక హక్కుల్ని కాపాడాలి. రాజస్థాన్​లోని గనుల్లో పనిచేసేందుకు బీహారీలు తమ పిల్లలను రూ.20 వేలకు పంపిస్తారు. వాళ్లను తిరిగి బీహార్​కు పంపిస్తే, అక్కడి ప్రభుత్వం ఒప్పుకోలేదు. జోధ్​పూర్​ నుంచి ఢిల్లీ, లక్నోలకు, ఉదయ్​పూర్​ నుంచి ముంబైకి ఆడ పిల్లలను తరలిస్తున్నారు. అలాగే రాజస్థాన్​ గిరిజన యువతులను గుజరాత్​ పంపించారు’’ అని బెంచ్​ వ్యాఖ్యానించింది. మిస్సింగ్​ కేసులపై కౌంటర్​ వేయాల్సిందిగా సర్కారును ఆదేశిస్తూ విచారణను వచ్చే నెల 10కి వాయిదా వేసింది. అయితే, రాష్ట్రంలో229 మందిని అక్రమ రవాణా చేశారంటూ కేసులు నమోదయ్యాయని, కేవలం 49 కేసుల్లోనే పోలీసులు చార్జిషీటు వేశారని రాపోల్​ భాస్కర్​ కోర్టుకు తెలిపారు. 2015 నుంచి 2018 మధ్య 1,350 మంది బాలికలు, 800 అబ్బాయిలు మిస్సయ్యారని, అందులో ఎక్కువగా ఉన్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలేనని చెప్పారు. సీనియర్​ లాయర్​ రవిచందర్​ కల్పించుకుని, ఇదే విషయంపై ప్రజ్వల అనే సంస్థ వేసిన పిల్​ కూడా కోర్టులో పెండింగ్​లో ఉందని గుర్తు చేశారు. ఆ పిల్​నూ కలిపి విచారిస్తామని బెంచ్​ స్పష్టం చేసింది.