ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

హైదరాబాద్‌‌, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని పక్కరాష్ట్రంలో నిర్ణయించారని, రాష్ట్రంలో కూడా సర్కార్‌‌లో విలీనం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ మజ్దూర్‌‌ యూనియన్‌‌ (టీఎంయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి డిమాండ్‌‌ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసీని విలీనం చేయాలన్నారు. సోమవారం బస్‌‌భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్మికులు, ఉద్యోగుల నుంచి రికవరీ చేసిన పీఎఫ్‌‌, సీసీఎస్‌‌, ఎస్బీటీ, ఎస్‌‌ఆర్‌‌బీఎస్‌‌ డబ్బులను యాజమాన్యం ఉపయోగించుకుందని, కార్మికులకు లోన్లు ఇవ్వడంలేదని మండిపడ్డారు. తమ సమస్యలపై రవాణా మంత్రిని కలిసే పరిస్థితి లేదని వాపోయారు. కాలయాపన కోసమే ప్రభుత్వం ఆర్టీసీలో నిపుణుల కమిటీ వేసిందని ఆరోపించారు.

యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 25న రాష్ట్ర వ్యాప్తంగా డిపోలు, యూనిట్ల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.2 వేల కోట్ల బకాయిలు వస్తే, ఆర్టీసీ లాభాల్లోకి వెళ్తుందన్నారు. టీఎంయూ టీఆర్‌‌ఎస్‌‌ అనుబంధ సంఘం కాదని స్పష్టం చేశారు. సకల జనుల సమ్మె కాలం నాటి జీతాన్ని ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఎంతటి త్యాగానికైనా వెనకాడబోమన్నారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతిరావు, వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ థామస్‌‌ రెడ్డి, మారయ్య, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.