V6 News

చాట్ జీపీటీ సాయంతో టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్.. సిట్ దర్యాప్తులో రోజుకో ట్విస్ట్

చాట్ జీపీటీ సాయంతో టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్.. సిట్ దర్యాప్తులో రోజుకో ట్విస్ట్

ప్రభుత్వ విభాగాల్లో నియామకాల కోసం నిర్వహించే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) పరీక్ష పేపర్‌ లీక్‌ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో నిందితుల్లో ఒకరు చాట్‌జీపీటీ, ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఉపయోగించి అభ్యర్థులతో సమాధానాలు పంచుకున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) గుర్తించింది.

తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ( TSNPDCL )లో డివిజనల్ ఇంజనీర్ అయిన పూల రమేష్ అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను విక్రయించాడని, తాజాగా AI టూల్, ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ఉపయోగించాడని సిట్ దర్యాప్తులో వెల్లడైంది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE), డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (DAO) పరీక్షలు రాసే కొంతమంది అభ్యర్థులకు సహాయం చేసినట్టు తేలింది.

పరీక్ష హాల్‌లో ఉన్న కనీసం ఏడుగురు అభ్యర్థులతో రమేష్ ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా సమాధానాలను పంచుకున్నారని సిట్ ఆరోపించింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో చాట్‌జీపీటీ (చాట్ జనరేటివ్ ప్రీ-ట్రైనింగ్ ట్రాన్స్‌ఫార్మర్), ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం వెలుగులోకి రావడం ఇదే తొలిసారి అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎలక్ట్రానిక్ పరికరాలతో పరీక్ష రాసిన ప్రశాంత్, నరేష్, మహేష్, శ్రీనివాస్‌లను సిట్ మే 29న అరెస్టు చేసింది .

ఎగ్జామ్ హాల్ ప్రవేశ ద్వారం వద్ద గుర్తించకుండా ఎలక్ట్రానిక్ పరికరాలతో అభ్యర్థులు ఎలా ప్రవేశించగలిగారనే దానిపై అధికారులు దృష్టి సారించారు. బ్లూటూత్ మైక్రో ఇయర్‌ఫోన్స్ తో కూడిన పరికరాలతో పరీక్ష హాలులోకి ప్రవేశించడంలో వారికి సహాయం చేసిన ఎగ్జామినర్ కోసం వారు వెతుకుతున్నట్టు సమాచారం. పరీక్ష ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసి రమేష్‌కు వాట్సాప్‌లో పంపినట్లు కూడా అనుమానిస్తున్నారు. మే 29న జరిగిన అరెస్టులతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 49కి చేరింది.

ఎగ్జామినర్ ద్వారా తన మొబైల్‌లో ప్రశ్న పత్రాన్ని స్వీకరించిన తర్వాత, రమేశ్ మరో నలుగురి సహాయంతో సరైన సమాధానాలను పొందడానికి ChatGPTని ఉపయోగించాడు. బ్లూటూత్ ఇయర్‌బడ్‌లను ఉపయోగించి పరీక్ష హాల్‌లో ఉన్న అభ్యర్థులకు దాన్ని షేర్ చేశాడు. ఒక్కో అభ్యర్థితో రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు రమేష్ డీల్ కుదుర్చుకున్నారని సిట్ ఆరోపించింది.