ఎండలు మండుతున్నై: ఏసీ బస్సులవైపు ప్రయాణికుల చూపు

ఎండలు మండుతున్నై: ఏసీ బస్సులవైపు ప్రయాణికుల చూపు

సమ్మర్ సీజన్ ప్రారంభం కాక ముందే ఎండలు దంచి కొడుతున్నాయి. పగటి వేళ ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగి పోయాయి. దీంతో ఎండల నుంచి కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు ప్రయాణికులు. ఇక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే  వారు ఏసీ బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో వేసవికి ముందే ఏసీ బస్సులకు డిమాండ్ పెరిగింది. గత 15 రోజుల నుంచి ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సి పెరిగిందంటున్నారు ఆర్టీసీ అధికారులు.

వేసవి రాకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 11 గంటలకే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే సమ్మర్ పూర్తి స్థాయిలో స్టార్ట్ అయ్యాక ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు సిటీ జనం. 15రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఏసీ బస్సులకు ప్రాధాన్యత ఇస్తున్నారు సిటీ జనాలు. ఆరోగ్యం ముందు బస్సు ఛార్జీలేం ఎక్కువ కాదంటున్నారు.

వారం రోజుల నుంచి ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరిగిందంటున్నారు ఆర్టీసీ డ్రైవర్లు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రతి ట్రిప్పులో బస్సు ఫుల్ ఐపోతుందంటున్నారు. ఐతే సమ్మర్ దృష్టిలో ఉంచుకుని ఏసీ బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు. గతంలో రోజుకు 5 వేల ఆదాయం వస్తే ప్రస్తుతం 10 వేల వరకు మనీ కలెక్టవుతుందంటున్నారు. ఏసీ బస్సుల్లో ఛార్జీలు ఎక్కువగా ఉండడంతో పేదలు ఏసీ బస్సులు ఎక్కలేని పరిస్థితి నెలకొంది. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏసీ బస్సు ఛార్జీలు నిర్ణయించాలంటున్నారు జనాలు.

ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 143 ఏసీ బస్సులు తిరుగుతున్నాయి. ఇందులో 40 బస్సులు ఎయిర్ పోర్టుకు, మిగతావి సిటీలో వేర్వేరు ప్రాంతాల నడుమ తిరుగుతున్నాయి. చలి, వాన కాలంలో పెద్దగా ఆదరణ లేకున్నా, ఎండకాలంలో ఏసీ బస్సుల వైపై మొగ్గు చూపుతున్నారు సిటీ జనాలు. ఈ సారి ముందస్తుగానే ఎండలు దంచి కొడుతుండడంతో ఏసీ బస్సులనే ఆశ్రయిస్తున్నారని చెప్తున్నారు అధికారులు. గత పదిరోజులుగా ఏసీ బస్సుల్లో ఆక్యూపెన్సి పెరిగిందంటున్నారు. సాధారణ రోజుల్లో 70 నుంచి 80 శాతంగా ఉండే అక్యూపెన్సి ప్రస్తుతం 90 శాతం వరకు వస్తుందంటున్నారు. మరికొద్ది రోజుల్లో మరో 40 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని చెప్తున్నారు. ఎండలు పెరిగిపోతున్నందున ఏసీ బస్సుల సంఖ్యతో పాటు ట్రిప్పులు పెంచాలని కోరుతున్నారు ప్రయాణికులు.