తమిళ్ పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్: విజయ్‎కు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేపై AMMK బహిష్కరణ వేటు

తమిళ్ పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్: విజయ్‎కు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేపై AMMK బహిష్కరణ వేటు

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ విజయం సాధించిన రోజు నుంచి ఆ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విజయ్‎కు మద్దతు ఇచ్చేందుకు ఎవరూ ఊహించని విధంగా డీఎంకే కూటమిలోని కాంగ్రెస్‎తో పాటు ఇతర చిన్న పార్టీలు ముందుకు రాగా.. ఇదే అంశంలో అన్నాడీఎంకే రెండుగా చీలింది. పళనిస్వామికి వ్యతిరేకంగా షణ్ముగం వర్గం తిరుగుబావుటా ఎగరేసింది.

ఇదిలా ఉండగానే, టీవీకేకు మద్దతు ఇచ్చిన తమ పార్టీ ఎమ్మెల్యే ఎస్. కామరాజ్‌ను టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) పార్టీ బహిష్కరించింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పార్టీ పదవుల నుంచి కామరాజ్‌ను తక్షణమే తొలగించినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏఎంఎంకే పార్టీ మంగళవారం (మే 12) ఒక ప్రకటన విడుదల చేసింది.

ఎస్. కామరాజ్ టీవీకేకు మద్దతు తెలపడం ఏకపక్షం, పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమైనదిగా పార్టీ చీఫ్ దినకరన్ అభివర్ణించారు. కామరాజ్ చర్య ఏఎంఎంకే కార్యకర్తలు, అతని విజయం కోసం ప్రచారం చేసిన మిత్రపక్ష సభ్యులు, ఎన్నికలలో అతనికి ఓటు వేసిన ప్రజలకు చేసిన పెద్ద ద్రోహమని పేర్కొన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన పార్టీకి కామరాజ్ అపఖ్యాతి తెచ్చారని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. పార్టీ లైన్ క్రాస్ చేసిన ఎస్. కామరాజ్‎ను పార్టీ నుంచి తక్షణమే బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. 

ఎవరీ ఎస్.కామరాజ్..?

టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) పార్టీలో ఎస్. కామరాజ్ సీనియర్ లీడర్. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కామరాజ్ మన్నార్గుడి స్థానం నుంచి డీఎంకే అభ్యర్థి టీఆర్‌బీ రాజాపై 1,566 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఏఎంఎంకే పార్టీ ఏకైక ఎమ్మెల్యే ఎస్. కామరాజే కావడం గమనార్హం. టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ లేకపోవడంతో ఎస్. కామరాజ్ విజయ్‎కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీంతో ఏఎంఎంకే పార్టీ అతడిపై బహిష్కరణ వేటు వేసింది. పార్టీ తరుఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేపై ఏఎంఎంకే వేటు వేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.