
- మంత్రి తుమ్మల నాగేశ్వ రావు
సిద్దిపేట, వెలుగు: రాబోయే రెండు, మూడేండ్లలో రాష్ట్రంలో 6 లక్షల ఎకరాలకు ఆయిల్ పామ్ సాగు చేరుకుంటుందని, దేశంలోనే నంబర్ వన్‌గా తెలంగాణ నిలవడం ఖాయమని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీని శనివారం సందర్శించి డ్రై రన్ ద్వారా ముడి పామాయిల్ ఉత్పత్తిని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. అత్యాధునిక యంత్రాలతో దేశంలోనే మొదటిసారి నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశామని, త్వరలో సీఎం ప్రారంభిస్తారని చెప్పారు.
లక్ష మంది ఆయిల్ పామ్ రైతులతో సభ ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేయగా, జిల్లా, ఆయిల్ ఫెడ్ అధికారులు ఫ్యాక్టరీ నిర్మాణం వేగంగా పూర్తి చేశారని అభినందించారు. వంట నూనె కోసం ప్రతి ఏడాది విదేశాలకు లక్ష కోట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు. భవిష్యత్తులో ఇక్కడ నిర్ణయించే ధరను దేశంలోని అన్ని ప్రాంతాల రైతులకు చెల్లించడం జరుగుతుందన్నారు. దేశంలో 13 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతుంటే, ఏపీ, తెలంగాణలోనే 10 లక్షల ఎకరాలు ఉందన్నారు. వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, ఉద్యానవన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కలెక్టర్ హైమవతి పాల్గొన్నారు.