మంత్రినే ఏయ్ అంటరా : మందుల సామేల్

మంత్రినే ఏయ్ అంటరా : మందుల సామేల్
  •  ఇదేనా బీఆర్ఎస్​ నేతల సభా గౌరవం 

హైదరాబాద్, వెలుగు : ‘‘రాష్ట్ర మంత్రి మాట్లాడుతుంటే ఏయ్ అంటారా? ఇదేనా మీ సభా మర్యాద?’’ అంటూ బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ఎమ్మెల్యే  మందుల సామేల్ ప్రశ్నించారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్​పై చర్చ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుండగా.. ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్​ రెడ్డి.. ఏయ్​కూర్చో అని వ్యాఖ్యానించడంపై సామేల్​మండిపడ్డారు. బీఆర్ఎస్​ సభ్యులు సభా మర్యాద పాటించడంలేదని ఫైర్​ అయ్యారు. గోల్కొండ కోటపై జెండా ఎగురవేసి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేశారని ఆయన విమర్శించారు. 

తెలంగాణ ప్రజలను వాళ్ల బానిసలు అనుకున్నారని దుయ్యబట్టారు. ‘‘నైజాం సర్కారోడా.. గోల్కొండ కోట కింద నీ ఘోరికడుతం’’ అని బండి యాదగిరి పాట రాశారని ఆయన గుర్తుచేశారు. నాడు దొరలు, దేశ్ ముఖులు, జాగీర్దాలు.. నైజాం సర్కారుకు, రజాకార్లకు వంతపాడి పేదలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్నారు.  అలాంటి వారి కోటలో బీఆర్ఎస్ ప్రభుత్వం జాతీయజెండా ఎలా ఎగురవేసిందని ఆయన ప్రశ్నించారు. జెండావిష్కరణకు మనకు పరేడ్ గ్రౌండ్​  కేటాయించారని గుర్తుచేశారు. అందుకే ప్రజలు ఓటు అనే బాంబు వేస్తే.. వాళ్లు ప్రతిపక్షంలో పడ్డారని ఎద్దేవా చేశారు. మరోసారి మంత్రులను, వ్యవస్థను అవమానపర్చే విధంగా మాట్లాడితే చరిత్ర క్షమించదని సామేల్​హెచ్చరించారు.