
టర్కీ, సిరియాలో సంభవించిన పెను భూకంపం తీరని విషాదాన్ని మిగిల్చింది. వేల సంఖ్యలో ప్రజలు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఎన్నో వేల మంది ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకున్నారు. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక్కో శిథిలాన్ని తొలగిస్తూ జనాన్ని తీస్తున్నారు. ఇలాంటి విషాదకర సమయంలో ఇద్దరు చిన్నారులకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భూకంపం ధాటికి కుప్పకూలిన ఓ భవన శిథిలాల కింద ఓ బాలిక, తన తమ్ముడితో ఇరుక్కుపోయింది.
అయితే.. స్లాబ్‌కు ఒకవైపు నేల, మరోవైపు పిల్లర్ సపోర్టుగా ఉండడంతో వారు ప్రాణాలతో బిక్కు బిక్కు మంటూ అక్కడే ఉండిపోయారు. ప్రాణభయంతో గంటల పాటు శిథిలాల కిందే ఉన్నారు. ఆ సమయంలో బాలిక తన తమ్ముడి కోసం ఆరాటపడిన తీరు అబ్బురపరుస్తోంది. తమ్ముడి తలకు ఆ బాలిక తన చేయిని అడ్డంపెట్టిన తీరు అక్కా తమ్ముడి ప్రేమకు నిదర్శనంగా నిలుస్తోంది. చాలా సేపు ఆ శిథిలాల కింద ఉండిపోయారు. తమ్ముడికి ధైర్యం చెబుతూ ఆ బాలిక సహాయం కోసం ఎదురుచూసింది. ఈ ఫొటో చూసిన నెటిజెన్లు బాలికను ప్రశంసిస్తున్నారు.