చెన్నై: హీరో విజయ్ చాలా తక్కువ టైంలోనే రాజకీయాల్లో అద్భుత ఫలితాన్ని సాధించారు. ఆయన 2024 ఫిబ్రవరి 2నే తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని ప్రకటించారు. 2024 ఆగస్టు 22న పార్టీ జెండాను, గీతాన్ని ఆవిష్కరించారు. 2024 అక్టోబర్ 27న టీవీకే సిద్ధాంతాలను విజయ్ ప్రకటించారు. ఈ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం 2026 జనవరి 22న అధికారికంగా ‘విజిల్’ గుర్తును కేటాయించింది. అంటే టీవీకే పార్టీకి గుర్తును 3 నెలల క్రితమే కేటాయించారు. అయినప్పటికీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ప్రజలకు తన పార్టీ గుర్తును, అజెండాను చేరవేయడంలో విజయ్ సక్సెస్ అయ్యారు.
ఎంజీఆర్ బాటలో..
డీఎంకే పార్టీని సీఎన్ అన్నాదురై 1949 సెప్టెంబర్ 17న స్థాపించారు. ఆయన 1969 ఫిబ్రవరి 3న మరణించిన తర్వాత కరుణానిధి సీఎం అయ్యారు. ఆ సమయానికి డీఎంకేలోనే ఉన్న ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) పార్టీలో మంచి పాపు లారిటీ ఉండేది. అన్నాదురై మరణం అనంతరం రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీఎంకే పార్టీని నడిపే విషయంలో కరుణానిధి, ఎంజీ ఆర్ మధ్య విభేదాలు వచ్చాయి. 1972 అక్టోబరు 10న ఎంజీఆర్‌ను డీఎంకే నుంచి బహిష్కరించారు. తనను పార్టీ నుంచి పంపేసిన వారం రోజుల్లోనే 1972 అక్టోబర్ 17న అన్నాడీఎంకే పార్టీని ఎంజీఆర్ ప్రకటించారు. అన్నాదురై ఆశయాల సాధన కోసం పనిచేసే అసలైన పార్టీ అన్నాడీఎంకేనే అంటూ ప్రజలకు చేరువయ్యారు. 1977 తమిళనాడు ఎన్నికల్లో ఎంజీఆర్ నాయకత్వంలోని అన్నా డీఎంకే కూటమి 144 సీట్లతో నిర్ణయాత్మక విజయాన్ని అందుకుంది. హీరో విజయ్ సైతం ఇలాంటి వ్యూహాన్నే క్షేత్రస్థాయిలో అమలు చేశారు.
