తమిళనాడులో విజయ్ సర్కార్ కొలువు దీరింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్ తో ప్రమాణం చేయించారు. విజయ్ తమిళంలో ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారం చేసేటపుడు విజయ్ ..విజయ్ అనే నినాదాలతో స్టేడియం హోరెత్తింది.
విజయ్ తో పాటు మరో తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో ఎన్.ఆనంద్, ఆధవ అర్జున, డాక్టర్ కేజీ. అరుణ్ రాజ్, కేఏ సెంగొట్టియన్, పి.వెంకటరమణ, ఆర్. నిర్మల్ కుమార్, రాజమోహన్, డాక్టర్ కె. ప్రభు, సెల్వి ఎస్, కీర్తన ఉన్నారు.
విజయ్ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. టీవీకేకు మద్దతిస్తున్న ఐదు పార్టీల అధినేతలు హాజరయ్యారు. విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో నటి త్రిష స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. కార్యకర్తలకు,అభిమానులకు అభివాదం తెలుపుతూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
విజయ్ ప్రమాణస్వీకారానికి నెహ్రూ స్టేడియానికి అభిమానులు,కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వేలాదిమందితో నెహ్రూ స్టేడియం కిక్కిరిసిపోయింది. చెన్నై పోలీసులు స్టేడియం పరిసరాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్లతో పహారా కాస్తున్నారు.
గత 59 ఏళ్లుగా ద్రవిడ పార్టీల (డీఎంకే, అన్నాడీఎంకే) ఆధిపత్యంలో ఉన్న తమిళనాడు రాజకీయాల్లో, ఒక ‘ద్రవిడ యేతర’ నాయకుడు ముఖ్యమంత్రి కావడం ఇదే మొదటిసారి. అంతేకాదు తమిళనాడులో ఏర్పాటుకానున్న తొలి సంకీర్ణ ప్రభుత్వంగా టీవీకే సర్కారు రికార్డులకెక్కింది.విజయ్ టీవీకేకు వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు బేషరతు మద్దతు తెలపడంతో తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ దక్కింది.
