అరుదైన పొలిటికల్‌‌‌‌ స్టార్టప్‌‌‌‌గా టీవీకే..దేశ రాజకీయాల్లోనే హాట్ టాపిక్‌‌‌‌

అరుదైన పొలిటికల్‌‌‌‌ స్టార్టప్‌‌‌‌గా  టీవీకే..దేశ రాజకీయాల్లోనే హాట్ టాపిక్‌‌‌‌
  • ఎన్నికల బరిలోకి దిగిన తొలిసారే అఖండ విజయం
  • దేశ రాజకీయాల్లోనే హాట్ ​టాపిక్‌‌‌‌

న్యూఢిల్లీ: భారత రాజకీయ యవనికపై ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తమిళ సినీ దిగ్గజం విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) ఎన్నికల బరిలో దిగిన తొలిసారే అద్భుతమైన ఫలితాలను సాధించి, అందరి దృష్టిని ఆకర్షించింది.  దశాబ్దాలుగా తమిళనాడును శాసిస్తున్న డీఎంకే, ఏఐఏడీఎంకేలాంటి బలమైన పార్టీలను వెనక్కి నెట్టి, టీవీకే విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనాన్ని సృష్టించింది. ఒక కొత్త పార్టీ తన తొలి ప్రయత్నంలోనే ఇలాంటి భారీ ఆధిక్యాన్ని సాధించడం భారత రాజకీయ చరిత్రలో చాలా అరుదుగా కనిపిస్తుంది. గతంలో ఎన్టీ రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 1983లో ఆవిర్భవించిన ఏడాదికే 201 సీట్లు గెలుచుకొని సంచలనం సృష్టించగా, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌‌‌‌), అస్సాం గణ పరిషత్ (ఏజీపీ) లాంటి పార్టీలు మాత్రమే ఈ తరహా ఘనతను అందుకున్నాయి. 

అయితే,  రాజకీయాల్లోకి వచ్చే ప్రతి ‘స్టార్టప్’ విజయవంతం కావడం లేదు. నిరుడు బిహార్‌‌‌‌‌‌‌‌లో భారీ అంచనాల మధ్య రంగ ప్రవేశం చేసిన ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ‘జన్ సూరాజ్’ పార్టీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేక చతికిలపడింది. అలాగే, గతంలో తమిళనాట కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌‌‌‌ఎం) కూడా 2021 ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో విజయ్ సాధించిన విజయం ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచిపోనుంది. సిద్ధాంతాలు, వారసత్వ రాజకీయాలు, చీలిక గ్రూపుల ద్వారా కాకుండా, ఒక నటుడు తనకున్న ప్రజాదరణను పక్కా రాజకీయ వ్యూహంగా మార్చి ఇంతటి విజయాన్ని అందుకోవడం విశేషం. కోట్లాది మంది అభిమానులు, బలమైన కేడర్ కలిగిన విజయ్ నాయకత్వంలో టీవీకే సృష్టించిన ఈ రాజకీయ ప్రకంపనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.