
- మనస్తాపంతో దిండుతో ఊపిరాడకుండా చేసి పిల్లల హత్య
- ఆపై బిల్డింగ్‌పై నుంచి దూకి సూసైడ్
- హైదరాబాద్‌లోని బాలానగర్‌లో విషాదం
కూకట్పల్లి, వెలుగు: కవల పిల్లల హెల్త్ విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ.. మొత్తం కుటుంబాన్నే బలి తీసుకున్నది. తన రెండేండ్ల ఇద్దరు చిన్నారులను గొంతు నులిమి హత్య చేసిన తల్లి.. తర్వాత బిల్డింగ్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నది. ఈ ఘటన హైదరాబాద్ బాలానగర్ పరిధిలో చోటు చేసుకున్నది.
ఏపీలోని ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన అనిల్‌కుమార్, సాయిలక్ష్మి దంపతులు. కొన్నేండ్లుగా బాలానగర్ పరిధిలోని పద్మానగర్ ఫస్ట్ ఫేజ్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి చేతన్ కార్తికేయ, లాస్యతవల్లి అనే రెండేండ్ల కవల పిల్లలు ఉన్నారు. అనిల్ కుమార్ ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. పిల్లలు పుట్టినప్పటి నుంచి వారిని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.
మాటలు కూడా సరిగా రావడం లేదు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో సాయిలక్ష్మి తీవ్ర మనస్తాపానికి గురయ్యేది. ఆదివారం రాత్రి అనిల్ కుమార్ ఇంటికి రాలేదు. ఈ అంశంపై ఫోన్లో ఇద్దరూ గొడవపడ్డట్లు సమాచారం. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో సాయిలక్ష్మి (27) తాను నివాసం ఉంటున్న బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్ నుంచి దూకి సూసైడ్ చేసుకున్నది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో వెళ్లి చూడగా అప్పటికే చేతన్ కార్తికేయ, లాస్యతవల్లి చనిపోయి ఉన్నారు. సాయిలక్ష్మి తన ఇద్దరు పిల్లలను దిండుతో ఊపిరాడకుండా చేసి తర్వాత సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. డెడ్‌బాడీలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.