రెండు సార్లు పోస్టుమార్టం.. చనిపోయిన 12 రోజుల తర్వాత.. ట్విషా శర్మకు అంత్యక్రియలు..

రెండు సార్లు పోస్టుమార్టం.. చనిపోయిన 12 రోజుల తర్వాత.. ట్విషా శర్మకు అంత్యక్రియలు..

నటి ట్విషా శర్మ అంత్యక్రియలు పూర్తయ్యాయి.మధ్యప్రదేశ్ కోర్టు ఆదేశాల మేరకు ట్విషా శర్మ మృతదేహానికి రీపోస్టుమార్టం తర్వాత ఆదివారం ( మే 24 ) సాయంత్రం అంత్యక్రియలు పూర్తీ చేశారు. ఢిల్లీ ఎయిమ్స్ బృందం ప్రత్యేక విమానంలో భోపాల్ వెళ్లి ట్విషా శర్మ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం భోపాల్‌లోని భద్భదా విశ్రామ్ ఘాట్‌లో సాయంత్రం 5 గంటలకు ట్విషా అంత్యక్రియలు జరగగా... భావోద్వేగ దృశ్యాలు నెలకొన్నాయి. సాంప్రదాయ పద్ధతుల్లో చితికి నిప్పంటించగానే ఆమె తల్లి కన్నీటి పర్యంతమై కుప్పకూలిపోయారు.

నటి ట్విషా శర్మ 2026, మే 12న భోపాల్లోని తన అత్తగారింట్లో అనుమానస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. న్యాయవాది సమర్థ్ సింగ్తో వివాహం జరిగిన కేవలం ఐదు నెలలకే అత్తగారింట్లో ఉరి వేసుకుని శవమై కనిపించింది. ట్విషా మరణంపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ట్విషాను ఆమె భర్త, అత్తమామలే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని.. ఇది వరకట్నం కోసం జరిగిన హత్య అని ట్విషా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే, ట్విషా మృతిపై భోపాల్ పోలీసుల దర్యాప్తు, పోస్ట్మార్టం నివేదికపైన అనుమానం వ్యక్తం చేశారు.

►ALSO READ | కర్ణాటకలో ఘోరం: నదిలో ముత్యాల వేటకు వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన పది మంది మృతి..

ట్విషా మృతి కేసులో ఆమె భర్త సమర్థ్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. 10 రోజులుగా తప్పించుకు తిరుగుతున్న అతన్ని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ట్విషాను కట్నం కోసం వేధించారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ, సమర్థ్, అతని తల్లి, రిటైర్డ్ జడ్జి గిరిబాలా సింగ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

న్యాయవాది అయిన సమర్థ్, మధ్యప్రదేశ్ హైకోర్టులో తన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఉపసంహరించుకున్న కొన్ని గంటలకే జబల్ పూర్ కోర్టులో లొంగిపోయేందుకు వచ్చాడు. అయితే, భోపాల్ కోర్టులో లొంగిపోవాలని కోర్టు ఆదేశించడంతో, అక్కడే నిఘా ఉంచిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.