హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్‌యూజే) ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలన్నారు.
ఈ మేరకు గురువారం సెక్రటేరియట్‌లో సీఎస్ రామకృష్ణారావును కలిసి జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం సర్కారు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న హెల్త్ కేర్ ట్రస్ట్ పరిధిలోకి జర్నలిస్టులనూ తీసుకురావాలన్నారు. ఈ అంశంపై జర్నలిస్టు సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కోరగా సీఎస్సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టుల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
అనంతరం హెచ్‌యూజే రూపొందించిన మీడియా డైరీ-–2026ను సీఎస్ రామకృష్ణారావుకు సంఘం ప్రెసిడెంట్ అరుణ్‌కుమార్ అందజేశారు. టీడబ్ల్యూజేఎఫ్ స్టేట్ యాక్టింగ్ ప్రెసిడెంట్ పిల్లి రాంచందర్, ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య, హెచ్‌యూజే సెక్రటరీ జగదీశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ నవీన్, ట్రెజరర్రాజశేఖర్, వైస్ ప్రెసిడెంట్ దామోదర్, జాయింట్ సెక్రటరీ క్రాంతి పాల్గొన్నారు.
