
గతకొన్ని రోజుల క్రితం బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు కలకలం సృష్టించింది. ఈ కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు వేగంగా చేస్తున్నారు. బాంద్రాలోని సల్మాన్ ఖాన్ ఇంటి ముందు నుంచి ఇద్దరు బైక్‌పై వెళ్తూ కాల్పులు జరిపారు. ఆ ఇద్దరు నిందితులను ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ గుజరాత్‌లోని భుజ్‌లో అరెస్టు చేసినట్లు మంగళవారం తెలిపారు. విక్కీ గుప్తా(24), సాగర్ పాల్ (21) కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.
షూటర్లు ఇద్దరూ బీహార్‌లోని పశ్చిమ చంపారన్‌కు చెందినవారు. వారిపై ఇప్పటికే దొంగతనం, చైన్ స్నాచింగ్ వంటి కేసులు ఉన్నాయి. ఆదివారం జరిగిన కాల్పులు సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ గార్డు వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైలోని బాంద్రా పోలీసులు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీ సెక్షన్ 307, ఆయుధాల చట్టం కింద కేసు ఫైల్ చేశారు. ఈ కేసు ముంబై క్రైం బ్రాంచ్ విచారణ చేస్తుంది.10కి పైగా టీంలుగా విడిపోయి ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు.