
- ఎలారెడ్డిపేటలో ఇద్దరు వ్యాపారులు పరార్
- అధిక వడ్డీ ఇస్తామని నమ్మించి డబ్బులు వసూళ్లు
- రూ. కోటిన్నరకుపైగా మోసపోయిన బాధితులు
ఎల్లారెడ్డిపేట, వెలుగు: అధిక వడ్డీలు ఇస్తామని నమ్మించి వ్యాపారులు నిండా ముంచారు. రాత్రికి రాత్రే పరారైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి పదేండ్ల కింద రాజస్థాన్ నుంచి మార్వాడి గుమాన్ కుటుంబంతో వచ్చి రాధిక డ్రెస్సెస్ షాపును నిర్వహిస్తున్నాడు. కొన్నాళ్లకు బొప్పాపూర్ లో ఇల్లు కట్టుకొని ఉంటున్నాడు. అధిక వడ్డీలు ఇస్తానని బొప్పాపూర్, గొల్లపల్లి గ్రామాల్లోని పలువురి వద్ద దాదాపు రూ.కోటిన్నరకు పైగా వసూలు చేశాడు. రెండు రోజుల కింద షాప్‌లో సరుకును సర్దుకొని పరార్ అయ్యాడు. అదేవిధంగా మంచిర్యాల జిల్లాకు చెందిన రవి12 ఏండ్ల కింద వచ్చి ఎల్లారెడ్డిపేటలో నందసాయి డ్రెస్సెస్ షాపును నిర్వహిస్తున్నాడు. ఇక్కడే ఇంటిని నిర్మించుకొని బిజినెస్ చేస్తున్నాడు. పలువురి వద్ద సుమారు రూ. 40 లక్షల వరకు అప్పుగా తీసుకున్నాడు. వ్యాపారంలో నష్టం రావడంతో ఇంటిని అమ్మేశాడు. వీళ్లిద్దరూ రెండురోజుల వ్యవధిలో పరార్ కావడంతో అప్పు ఇచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు. అనుమానం వచ్చి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చినట్లు పలువురు బాధితులు తెలిపారు.