సైబర్ క్రైమ్ కేసులో అరెస్ట్ చేయకుండా ఉండేందుకు
రూ. 3 లక్షలు డిమాండ్
రూ. లక్ష తీసుకుంటూ దొరికిన ఎల్‌బీనగర్ సైబర్ క్రైమ్ ఎస్సైలు
ఎల్బీనగర్, వెలుగు : సైబర్ క్రైమ్ కేసులో అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ. లక్ష లంచం తీసుకున్న ఇద్దరు ఎస్సైలను ఏసీబీ ఆఫీసర్లు సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ గంగసాని శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం... ఆర్డ్మ్ రిజర్వ్ సబ్‌ఇన్స్‌పెక్టర్లు ప్రమోద్‌గౌడ్, జటావత్ బాబునాయక్ ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పీఎస్‌లో ఎస్సైలుగా పనిచేస్తున్నారు.
ఓ సైబర్ క్రైమ్ కేసులో నిందితులను అరెస్ట్ చేయకుండా ఉండడంతో పాటు వారి అకౌంట్‌ను ఫ్రీజ్ చేయకుండా చూసుకునేందుకు రూ. 3 లక్షల లంచం డిమాండ్ చేశారు. రూ. లక్ష ఇచ్చేందుకు ఒప్పుకున్న వారు తర్వాత ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు సదరు వ్యక్తులు సోమవారం ఎస్సైలను కలిసి డబ్బులు ఇచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఎస్సైలు ప్రమోద్‌గౌడ్, బాబునాయక్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డబ్బులను స్వాధీనం చేసుకున్న అనంతరం సైబర్ క్రైమ్ స్టేషన్‌లో సోదాలు నిర్వహించారు. అనంతరం ఇద్దరు ఎస్సైలను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు.
