- మరో ఇద్దరికి గాయాలు
- హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో ప్రమాదం
- మంచిర్యాల జిల్లాలో బైక్‌ను ఢీకొట్టిన ఆటో, తండ్రి మృతి, కొడుకుకు గాయాలు
శాయంపేట(ఆత్మకూర్), వెలుగు : కారు అదుపుతప్పి పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఈ ప్రమాదం హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండలం కొత్తగట్టు శివారులో బుధవారం అర్ధరాత్రి జరిగింది. ఆత్మకూర్ ఎస్సై సంపత్ తెలిపిన వివరాల ప్రకారం... భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లికి చెందిన పర్శ సంపత్ (55) కోల్డ్ స్టోరేజ్‌లో ఉన్న తన మిర్చి బస్తాలను అమ్మేందుకు ఏనుమాముల మార్కెట్‌కు వెళ్లాడు.
అక్కడ పని పూర్తి కావడంతో ఇంటికి వచ్చేందుకు సిద్ధమవుతుండగా.. తన కారు కీ కనిపించలేదు. దీంతో ఇంటి వద్ద రెండో కీ ఉందని తీసుకువద్దామంటూ తన అడ్తిదారు అయిన పరకాల మండలం నాగారానికి చెందిన బొంపెల్లి కిషన్‌కు చెప్పాడు. వీరిద్దరు, పరకాల మండలం కామరెడ్డిపల్లికి చెందిన పోతరాజు వెంకటేశ్, ఆత్మకూర్ మండల కేంద్రానికి చెందిన చింతపట్ల మురళీకృష్ణతో కలిసి నలుగురు కారులో రేపాకపల్లికి వెళ్లారు.
అక్కడ కారు కీ తీసుకొని తిరిగి మార్కెట్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో ఆత్మకూర్ మండలం కొత్తగట్టు శివారులోని మూలమలుపు వద్దకు రాగానే కారు అదుపుతప్పి పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ సంపత్, బొంపెల్లి కిషన్ అక్కడికక్కడే చనిపోగా మురళీకృష్ణ, వెంకటేశ్ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు.
బైక్‌ను ఢీకొట్టిన ఆటో, తండ్రి మృతి
కోల్‌బెల్ట్, వెలుగు : బైక్‌ను ట్రాలీ ఆటో ఢీకొట్టడంతో తండ్రి చనిపోగా, కొడుకుకు గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బురదగూడెం వద్ద గురువారం జరిగింది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... బొక్కలుగుట్ట గ్రామానికి చెందిన ఒళ్లపు నర్సయ్య (42) తన కొడుకు వెంకటేశ్‌తో కలిసి బైక్‌పై మందమర్రికి వెళ్తున్నాడు.
బురదగూడెం మదర్సా సమీపంలోకి రాగానే రాంగ్‌రూట్‌లో వచ్చిన ట్రాలీ ఆటో బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో నర్సయ్య అక్కడికక్కడే చనిపోగా, వెంకటేశ్‌కు గాయాలయ్యాయి. మృతుడి భార్య లత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
