బంజారా హిల్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాటర్ ట్యాంకర్ ర్యాపిడో బైకును ఢీకొన్న ఘటనలో హోమ్ గార్డు సహా ఓ యువతి మృతి చెందారు. సోమవారం ( ఫిబ్రవరి 23 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లో జరిగిన ఈ ప్రమాదంలో పార్ట్ టైం ర్యాపిడో డ్రైవర్ గా పని చేస్తున్న ఓ హోంగార్డ్, ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్న యువతి మృతి చెందారు.
సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో హోమ్ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్న 40 ఏళ్ళ మహమ్మద్ హుస్సేన్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా డ్యూటీ ముగిసిన అనంతరం పార్ట్‌టైమ్ రాపిడో డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది . సోమవారం 20ఏళ్ళ అక్షిత ర్యాపిడో బైక్ బుక్ చేసుకోవడంతో ఆమెను తన బైక్ పై బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 వైపు తీసుకెళ్తుండగా వేగంగా వచ్చిన ట్యాంకర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో వెంటనే నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడికి చేరుకునే సరికి వారు మృతి చెందినట్లు నిర్ధారించారు డాక్టర్లు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు.
