పోడు భూమి గుంజుకున్నరని ఒకరు.. అప్పుల బాధతో మరొకరు సూసైడ్

పోడు భూమి గుంజుకున్నరని ఒకరు.. అప్పుల బాధతో మరొకరు సూసైడ్

భద్రాద్రి కొత్తగూడెం, హాలియా, వెలుగు: 30 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూమిని ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నరు. 3 లక్షలకు పైగా అప్పు ఉంది. ఆసరాగా ఉన్న పొలం పోయింది.. అప్పు మాత్రమే మిగిలిందనే ఆవేదనతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో బుధవారం జరిగిందీ ఘటన. నల్గొండ జిల్లాలో మరో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పంట దిగుబడి పూర్తిగా పడిపోయి పెట్టుబడి పైసలు కూడా వచ్చే పరిస్థితి లేక, రూ.4 లక్షల దాకా ఉన్న అప్పులు ఎలా తీర్చాలో తెలియక సూసైడ్ చేసుకున్నాడు.

మొత్తం లాగేసుకున్నరని..

కొత్తగూడెం జిల్లా మామ కన్ను గ్రామానికి చెందిన కల్తీ కన్నయ్య (60).. 30 ఏళ్లుగా 30 ఎకరాల పోడు భూమిని సాగు చేసుకుంటున్నాడు. గత ఏడాది మార్చిలో మామకన్ను – బాటన్న నగర్ మధ్యలో కన్నయ్యకు చెందిన 15 ఎకరాల పోడు భూమిని ఫారెస్ట్ ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నారు. వారం కిందట మరో 15 ఎకరాల పోడు భూమిలో ట్రెంచ్ కొట్టారు. గతంలో స్వాధీనం చేసుకున్న భూమికి బదులుగా మరోచోట భూమి చూపిస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు మిగిలిన 15 ఎకరాలను లాక్కొని ట్రెంచ్ కొట్టారని కన్నయ్య భార్య సమ్మక్క వాపోయింది. సెంటు భూమి లేక, మూడు లక్షల అప్పు తీర్చే దారిలేక నాలుగు రోజులు కన్నయ్య మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం రాత్రి ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108 ద్వారా కొత్తగూడెం సర్కారు దవాఖానకి తీసుకెళ్లారు. ట్రీట్‌‌‌‌మెంట్ పొందుతూ బుధవారం చనిపోయాడు.

అప్పులు ఎలా తీర్చాలో తెలియక..

నల్గొండ జిల్లా చింతగూడేనికి చెందిన కూరాకుల యాదయ్య (37).. తనకున్న 3 ఎకరాలపాటు మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. 5 ఎకరాల్లో వరి, మిగతా భూమిలో పత్తి సాగు చేశాడు. వరికి తెగులు సోకి పంట పూర్తిగా దెబ్బతిన్నది. పత్తి కూడా సరైన దిగుబడి రాలేదు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగొచ్చే పరిస్థితి లేకుండా పోయింది. పంట పెట్టుబడి కోసం తెచ్చిన రూ.4 లక్షల అప్పు ఎలా తీర్చాలో అర్థం కాక మానసిక ఒత్తిడికి లోనైన యాదయ్య.. మంగళవారం తెల్లవారుజామున పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. చికిత్స చేయించేందుకు హైదారాబాద్‌‌‌‌లోని ఓ హాస్పిటల్‌‌‌‌కి తీసుకెళ్లగా.. బుధవారం చనిపోయాడు. యాదయ్యకు భార్య, కొడుకు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. యాదయ్య భార్య రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌‌‌‌ఐ క్రాంతి  కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కన్నయ్య డెడ్‌‌‌‌బాడీతో అఖిలపక్ష నేతల ధర్నా

పోడు రైతు కన్నయ్య మృతదేహంతో కొత్తగూడెం జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీ రూం ఎదుట అఖిలపక్ష నాయకులు ధర్నా చేశారు. భూమి లాక్కొని, కన్నయ్య మృతికి కారకులైన ఫారెస్ట్ ఆఫీసర్లను వెంటనే విధుల నుంచి తొలగించాలని, వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఫారెస్ట్ ఆఫీసర్లు గుంజుకున్న ల్యాండ్‌‌‌‌ను కన్నయ్య కుటుంబానికి ఇవ్వాలని, రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు భూములపై ఈ నెల 18న అఖిలపక్ష భేటీ నిర్వహించి భవిష్యత్ ఆందోళన కార్యక్రమాలు ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశాలతోనే ఫారెస్ట్ ఆఫీసర్లు పోడు రైతులపై దాడులు చేస్తున్నారన్నారు.