బీపీ పేషెంట్లకు గుడ్ న్యూస్.. ఇక టాబ్లెట్లకి బైబై, ఏడాదికి ఈ రెండు ఇంజెక్షన్లు చాలు!

బీపీ పేషెంట్లకు గుడ్ న్యూస్.. ఇక టాబ్లెట్లకి బైబై, ఏడాదికి ఈ రెండు ఇంజెక్షన్లు చాలు!

బ్లడ్ ప్రెజర్ (BP) లేదా రక్తపోటు సమస్య ఉన్నవారికి ఒక అద్భుతమైన వార్త! ఇప్పటివరకు ప్రతిరోజూ టాబ్లెట్లు వేసుకునే అవసరం లేకుండా, ఏడాదికి  కేవలం రెండు ఇంజెక్షన్లతో రక్తపోటును కంట్రోల్ చేసే కొత్త చికిత్స అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన వివరాలను ప్రముఖ వైద్య పత్రిక 'ది లాన్సెట్' (The Lancet) వెల్లడించింది.

ఏమిటీ ఈ కొత్త చికిత్స:
సాధారణంగా బీపీ ఉన్నవారు రోజుకు ఒకటైనా టాబ్లెట్ వేసుకోవాలి. కానీ చాలామంది మర్చిపోవడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు పెరుగుతున్నాయి. దీనికి పరిష్కారంగా శాస్త్రవేత్తలు జిలేబెసిరాన్ (Zilebesiran) అనే కొత్త మందును తయారు చేశారు. ఈ మందు కాలేయంలో రక్తపోటును పెంచే ఒక రకమైన ప్రోటీన్ ఉత్పత్తిని ఆపేస్తుంది. ఒక ఇంజెక్షన్ ఇస్తే ఆరు నెలల వరకు రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. అంటే ఏడాదికి రెండు సార్లు తీసుకుంటే సరిపోతుంది.

ఎందుకు  అవసరం:
ప్రపంచవ్యాప్తంగా సుమారు 140 కోట్ల మంది బీపీతో బాధపడుతున్నారు. మన దేశంలో కూడా ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య ఉంది. టాబ్లెట్లు వాడటంలో నిర్లక్ష్యం చేయడం వల్ల పరిస్థితి విషమిస్తోంది. ఈ ఇంజెక్షన్ రావడం వల్ల మందులు వేసుకోవడం మర్చిపోయే బాధ ఉండదు.

డాక్టర్లు ఏమంటున్నారంటే :
ఈ మందు బీపీ చికిత్సలో ఒక పెద్ద విప్లవం అని కొందరు వైద్యులు అంటున్నారు. దీనివల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని ఆశిస్తున్నారు. అయితే, ఎయిమ్స్ (AIIMS) వంటి సంస్థల వైద్యులు కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు. ఈ ఇంజెక్షన్ల ధర సామాన్యులకు అందుబాటులో ఉంటుందా లేదా అనేది ముఖ్యం. అలాగే, ఒకసారి ఇంజెక్షన్ ఇచ్చాక ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే, ఆ మందు ప్రభావం ఆరు నెలల వరకు శరీరంలోనే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ మందులు మూడవ దశ ప్రయోగాల్లో ఉన్నాయి. ఇవి పూర్తిగా సురక్షితమని తేలితే, భవిష్యత్తులో బీపీ టాబ్లెట్లకి గుడ్ బై చెప్పాల్సిందే.