
హైదరాబాద్, వెలుగు: మన సిటీ నుంచి త్వరలో రెండు కంపెనీలు ఐపీఓలకు రాబోతున్నాయి. ఒక కంపెనీ కన్జూమర్ డ్యూరబుల్ రిటెయిల్ చెయిన్ నిర్వహిస్తుండగా, మరో కంపెనీ స్టీల్ ప్రొడక్టులు తయారు చేస్తోంది. బజాజ్ ఎలక్ట్రానిక్స్ పేరిట రిటెయిల్ చెయిన్ నడుపుతున్న ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా రూ. 500 కోట్ల సమీకరణకు, స్టీల్ కంపెనీ హరిఓం పైప్ రూ. 120 కోట్ల సమీకరణకు ఐపీఓల కోసం సెబీ వద్ద ప్రాస్పెక్టస్ ఫైల్ చేశాయి. 7.5 లక్షల చదరపు అడుగు విస్తీర్ణంలో రిటెయిల్ స్టోర్సు ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ మార్ట్ దేశంలోనే 4వ ప్లేస్లో ఉన్నానని చెబుతోంది. కోటి మంది కస్టమర్లకు కన్జూమర్ డ్యూరబుల్స్ అమ్మామని, 2,600 మంది ఉద్యోగులున్నారని పేర్కొంటోంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలలో మరిన్ని స్టోర్లు ఏర్పాటు చేయడంతోపాటు, ఎన్సీఆర్ రీజియన్లో అడుగుపెట్టాలనుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది. కిందటేడాది రూ. 3,207 కోట్ల టర్నోవర్ సాధించినట్లు తెలిపింది. మరోవైపు స్టీల్ రంగంలోని హరిఓం పైప్ సంగారెడ్డి వద్ద కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. కొత్త ప్లాంటుకు ఏడాదికి 51,493 టన్నుల కెపాసిటీ ఉంటుందని, ఇప్పటికే ఉన్న కెపాసిటీ 2.41 లక్షల టన్నులని తెలిపింది. కంపెనీ టర్నోవర్ కిందటేడాది రూ. 255 కోట్లు.