ఒడిశాలో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

ఒడిశాలో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

భద్రాచలం, వెలుగు: ఒడిశా రాష్ట్రంలోని కందమాల్​ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఎస్పీ హరీశ్​ బీసీ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని రాయ్​కియా పోలీస్ స్టేషన్​ పరిధి నందబాలీ అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పక్కా సమాచారంతో భద్రతాబలగాలను కూంబింగ్​కు పంపించారు. కూంబింగ్​ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు.

ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. కాల్పులు జరుపుకుంటూ మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. ఘటనా స్థలంలో ఇద్దరు మావోయిస్టుల డెడ్ బాడీలను గుర్తించారు. మావోయిస్టు డిప్యూటీ కమాండర్  జోగేశ్, మహిళా మావోయిస్టు సభ్యురాలు రత్నగా వారిని గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు.

ఏకె-47తో పాటు యూబీజీఎల్, 7.6 ఎంఎం రైఫిల్, యూబీజీఎల్​ గ్రైనేడ్, మాగజైన్లు, డిటోనేటర్లు, వైర్​లెస్​ సెట్లు, సోలార్​ ప్యానెల్స్, మందులు, విప్లవ సాహిత్యం, నిత్యావసర సరుకులు భారీ ఎత్తున దొరికాయి. డెడ్​బాడీలు, స్వాధీనం చేసుకున్న వస్తువులను కందమాల్  జిల్లా కేంద్రానికి తరలించారు. జోగేశ్​పై రూ.22లక్షలు, రత్నపై రూ.1.65 లక్షల రివార్డు ఉంది. వీరిద్దరిదీ ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని సుక్మా జిల్లా అని ఎస్సీ చెప్పారు.