- అరవకుండా నోట్లో బట్టలు కుక్కి.. కదలకుండా చేతులకు కట్లు
- రెండునెలల కొడుకుపై తల్లి కర్కశం
- భర్త వచ్చే సరికి కాలిపోతున్న కొడుకు
- బయటకు తీసినా దక్కని ప్రాణం..కాలిన గాయాలతో మృతి
- కుత్బుల్లాపూర్‌లోని బౌరంపేట్‌లో అమానవీయ ఘటన
- షాక్‌కు గురైన ఇరుగుపొరుగువారు.. కేసు నమోదు చేసిన పోలీసులు
జీడిమెట్ల, వెలుగు: హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో అమానవీయ ఘటన జరిగింది. రాత్రినుంచి ఆపకుండా ఏడుస్తున్నాడని, ఎంత బుజ్జగించినా వినడంలేదని విసిగిపోయిన తల్లి తన 2 నెలల కొడుకు ను అరవకుండా నోట్లో బట్టలు కుక్కి.. కదలకుండా చేతులను కట్టేసి పొయ్యిలో వేసింది. బాలుడు చనిపో వడంతో కన్నీటి పర్యంతమైన తండ్రి.. ఆమెతో గొడ వకు దిగాడు. దంపతుల మధ్య వివాదం గురించి స్థాని కులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
మధ్యప్రదేశ్‌రాష్ట్రంలోని బీనాస్టేషన్సాగర్, నవ్వగావ గ్రామానికి చెందిన రాజేంద్ర ఆదివాసి (21)..అదే ప్రాంతానికి చెందిన మమత (19) అహిర్వార్‌ను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. వీరికి ఓ బాబు పుట్టాడు. అక్కడేమీ పనులు లేకపోవడంతో నెల కిందట వారు బతుకుదెరువుకోసం హైదరాబాద్‌కు వచ్చారు. మేడ్చల్‌జిల్లా కుత్బుల్లాపూర్నియోజవర్గం బౌరంపేటలోని సనరెల్లి కన్స్ట్రక్షన్స్ నిర్మిస్తున్న అపార్ట్మెంట్ల వద్ద లేబర్క్యాంప్లోని రేకుల షెడ్డులో ఉంటున్నారు.
బాబుతో కలిసి మమత ఇంట్లోనే ఉంటుండగా.. రాజేంద్ర ఒక్కడే రోజూ ఉదయం పనికి వెళ్లి మధ్యాహ్నం భోజనానికి వచ్చేవాడు. మళ్లీ వెళ్లి సాయంత్రమే తిరిగివచ్చేవాడు. మంగళవారం ఉదయం రాజేంద్ర తన భార్య, కొడుకు ఇంట్లో ఉండగా పనికి వెళ్లాడు. చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు. 11 గంటల టైంలో బాబు గుక్క పెట్టి ఏడవడం ప్రారంభించాడు. దీంతో కోపం కట్టలు తెంచుకున్న ఆ తల్లి ఏడవకుండా నోట్లో గుడ్డలు కుక్కింది. అయినా, ఆపకపోవడంతో వంట చేసుకునే కట్టెల పొయ్యిలో మరిన్ని కట్టెలు వేసి మంట పెంచింది.
బాబు కాళ్లు, చేతులు కట్టేసి అందులో పడేసింది. కొద్ది నిమిషాలకే ఇంటికి వచ్చిన రాజేంద్ర.. మంటల్లో కాలుతున్న బాబును చూసి షాక్‌కు గురయ్యాడు. వెంటనే తెరుకుని బాబును మంటల్లోంచి తీయగా అప్పటికే బాబు సగం వరకు కాలి ప్రాణాలు కోల్పోయి కనిపించాడు.
అడ్డు తొలగించుకోవాలనే..
బాబు మృతిచెందిన విషయం బయటకు రాకుండా అపార్ట్మెంట్స్యాజమాన్యం ప్రయత్నించినట్టు తెలిసింది. అయితే, పోలీసులకు స్థానికులు సమాచా రం చేరవేయడంతో వారు ఘటనాస్థలానికి వెళ్లి.. విచారణ చేపట్టారు. ఎప్పటికీ ఏడుస్తూ ఉన్నాడని, అడ్డు తొలగించుకోవాలనే బాబును తన భార్య హత్య చేసిందని రాజేంద్ర దుండిగల్పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నదని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్నారు.
అయితే, నిందితురాలిని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు ఘటన గురించి ప్రశ్నిస్తే వారిపైనే అరిచినట్టు తెలుస్తున్నది. అడిగినవాటికి సమాధానాలు చెప్పడం లేదని, అబ్నార్మల్గా ప్రవర్తించినట్టు సమాచారం. ఇంత ఘోరంగా హత్య చేసిన ఆమె మానసిక స్థితి సరిగ్గా ఉందా? లేదా? అన్నది తెలు సుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
