సృష్టి కేసులో పోలీస్ కస్టడీకి మరో ఇద్దరు నిందితులు.. ఏ-3 కళ్యాణి, ఏ-6-సంతోషికి గాంధీలో వైద్య పరీక్షలు

సృష్టి కేసులో పోలీస్ కస్టడీకి మరో ఇద్దరు నిందితులు.. ఏ-3 కళ్యాణి, ఏ-6-సంతోషికి గాంధీలో వైద్య పరీక్షలు
  • నార్త్ జోన్​ డీసీపీ కార్యాలయానికి తరలించి విచారణ
  • రెండోరోజు డాక్టర్​ నమ్రతను ఎంక్వైరీ చేసిన పోలీసుల

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ కోర్టు అనుమతితో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్​ కేసులో మరో ఇద్దరు నిందితులను గోపాలపురం పోలీసులు శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. అక్రమ సరోగసీ, శిశువుల కొనుగోలు, విక్రయం తదితర అభియోగాలకు సంబంధించిన కేసులో ఏ-3 నిందితురాలిగా ఉన్న విశాఖపట్నంలోని సృష్టి టెస్ట్ ట్యూబ్​ బేబీ సెంటర్​ బ్రాంచి మేనేజర్ సి.కళ్యాణి అచ్చాయమ్మ, ఏ-6  నిందితురాలిగా ఉన్న అస్సాం నివాసి ధనశ్రీ  సంతోషిని కస్టడీలోకి తీసుకున్నారు. 

సికింద్రాబాద్​ గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం  ఇద్దరినీ నార్త్ జోన్​ డీసీపీ కార్యాలయానికి తరలించి, విచారించారు. రాజస్థాన్​ దంపతులకు సరోగసీ పేరుతో ఇచ్చిన బాబు విషయానికి సంబంధించిన అంశంపై పోలీసులు కస్టడీలో పలు ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టినట్లు సమాచారం. 5 రోజుల కస్టడీలో  సృష్టి సెంటర్​ ఓనర్​ డాక్టర్​ నమ్రతను రెండోరోజు గోపాలపురం పోలీసులు పలు అంశాలపై విచారించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో అనేక కోణాల్లో విచారిస్తే, మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.