హైదరాబాద్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్.. ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్.. ఇద్దరు అరెస్ట్
  • పరారీలో మరో ఇద్దరు

హైదరాబాద్​ సిటీ, వెలుగు: సీఎంఆర్ఎఫ్ చెక్కుల​ గోల్​మాల్​ వ్యవహారంలో జూబ్లీహిల్స్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్​ చేశారు. సికింద్రాబాద్​కు చెందిన జోగుల నరేశ్​కుమార్, వనస్థలిపురానికి చెందిన  బలగోని వెంకటేశ్,  ఖమ్మం జిల్లాకు చెందిన కోర్లపాటి వంశీ, పెద్దపల్లి జిల్లా కేసీఆర్ కాలనీకి చెందిన పులిపాక ఓంకార్ కలిసి గత బీఆర్ఎస్​ హయాంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్​మాల్​కు పాల్పడ్డారు. 19 చెక్కులకు సంబంధించిన సొమ్మును ఫోర్జరీ పత్రాలతో వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నారు. 

విశ్వసనీయ సమాచారంతో మంగళవారం జూబ్లీహిల్స్ అడిషనల్ ఇన్​స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్. మధుసూదన్ తన సిబ్బంది సహాయంతో నరేశ్​, వెంకటేశ్​ను అరెస్ట్​ చేశారు.  విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. జోగుల నరేశ్​గతంలో ఓ మాజీ మంత్రి కార్యాలయంలో పనిచేయగా, అతడి నుంచి పోలీసులు మరింత సమాచారం సేకరిస్తున్నారు. పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరి కోసం
గాలిస్తున్నారు.