హైదరాబాద్: కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ ఢీ కొట్టి అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మహేష్ (17), లక్ష్మీ తేజ (17) మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ముగ్గురు యువకులు ఆదివారం క్రికెట్ ఆడటానికి స్కూటీపై వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
అతి వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కూకట్ పల్లి పోలీసులు టిప్పర్ లారీని సీజ్ చేశారు.
ఇలాంటి ఘటనే శనివారం కూడా జరిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి-44పై విషాదకర రోడ్డు ప్రమాదం జరిగింది. అస్సాంకు చెందిన 31 ఏళ్ల కార్మికుడు అర్జున్ భూమిజ్ హిట్ అండ్ రన్ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు.
మదనపల్లి పాత తండా యూ-టర్న్ సమీపంలో రహదారి దాటుతుండగా, శంషాబాద్ నుంచి షాద్‌నగర్ వైపు వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం అర్జున్‌ను ఢీకొట్టి ఆగకుండా పరారైంది. తీవ్ర గాయాలు కావడంతో అతడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు మృతుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులను గుర్తించారు. ఉపాధి కోసం ఐదు రోజుల క్రితం అస్సాం నుంచి జడ్చర్లకు బయలుదేరిన అర్జున్, డబ్బు లేకపోవడంతో కాచిగూడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
