స్వీట్ బాక్సుల్లో డ్రగ్స్ ..నలుగురు అరెస్ట్

స్వీట్ బాక్సుల్లో డ్రగ్స్ ..నలుగురు అరెస్ట్

హైదరాబాద్, వెలుగు: స్వీట్ బాక్సుల్లో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న ఇద్దరితో పాటు కొంటున్న మరో ఇద్దరిని ఎల్ బీనగర్ ఎస్ వోటీ, కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నేరెడ్ మెట్ లోని డీసీపీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో డీసీపీ జానకి వివరాలు వెల్లడించారు. ఏపీలోని గుంటూరుకు చెందిన మను ప్రశాంత్ పొనుగుపాటి(25) కొంతకాలం కిందట ముంబయిలో వీఎఫ్ఎక్స్ విభాగంలో పనిచేశాడు. అతడితో పాటు పనిచేసే నల్గొండకు చెందిన వరికుప్పల రిత్విక్(22)తో కలిసి డ్రగ్స్ సప్లయ్ చేయడం మొదలుపెట్టాడు.

హైదరాబాద్ కు చెందిన షేక్ ఉమర్ ఫారూఖ్(27), ఆనంద్ మాదె(22)కు వీళ్లు డ్రగ్స్ అమ్మేవారు. ఆదివారం సాయంత్రం కుషాయిగూడలోని నేతాజీనగర్ లో డ్రగ్స్ అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్వీట్ బాక్సుల్లో డ్రగ్స్ ను తీసుకొచ్చిన ప్రశాంత్. రిత్విక్ తో పాటు కొనేందుకు వచ్చిన ఫారూఖ్, ఆనంద్ ను అదుపులోకి తీసుకున్నారు. 50 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 10 ట్యాబ్లెట్లు, బైక్, 4 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. సోమవారం నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తలించామని డీసీపీ జానకి తెలిపారు.