అక్రమ కేసులు బనాయించిన సీఐ, ఎస్సై సస్పెన్షన్‌‌‌‌.. ఉత్తర్వులు​ జారీ చేసిన వరంగల్​ సీపీ రంగనాథ్​

అక్రమ కేసులు బనాయించిన సీఐ, ఎస్సై సస్పెన్షన్‌‌‌‌.. ఉత్తర్వులు​ జారీ చేసిన  వరంగల్​ సీపీ రంగనాథ్​

జనగామ, వెలుగు : భూబాధితుడి పైనే అక్రమ కేసులు బనాయించిన పోలీసులపై వరంగల్​ పోలీస్‌‌‌‌  కమిషనర్​ రంగనాథ్​​సస్పెన్షన్  విధించారు.కమిషనరేట్​ పరిధిలోని జనగామ జిల్లా నర్మెట సీఐ నాగబాబు, ఎస్సై అనిల్​ కుమార్​ను సస్పెండ్​ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నర్మెట మండలం అమ్మాపురానికి చెందిన చకిల పెద్దరామయ్యకు లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, రవీందర్​ కొడుకులున్నారు. 

రవీందర్  ఊరిలో ఉంటుండగా మిగిలిన వారు హైదరాబాద్​లో స్థిరపడ్డారు. అన్నలు లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు తండ్రికి చెందిన వారసత్వ భూమి తమకు కూడా రావాల్సి ఉందని వాదిస్తూ వస్తున్నారు. కొన్నేండ్లుగా వారి మధ్య సుమారు రెండెకరాలకు సంబంధించిన భూ పంచాయితీ నడుస్తున్నది. 30 ఏండ్ల క్రితం అన్నీ వదిలేసి తమ సోదరులు హైదరాబాద్​కు వెళ్లారని, అప్పటి నుంచి అమ్మానాన్నల బాగోగులు తానే చూసుకున్నానని, తీరా ఇప్పుడు వారు వాటా కావాలని అడగడం సరికాదని బాధితుడు రవీందర్​ తెలిపాడు. వారం క్రితం వరంగల్​ సీపీ రంగనాథ్​ ను రవీందర్  కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు.

 తన అన్నలు భూ తగాదాలు సృష్టించి ఇబ్బందులు కలిగిస్తున్నారని, ఈ విషయంలో తనకు న్యాయం చేయకుండా సీఐ నాగబాబు, ఎస్సై అనిల్​ కుమార్​ వారికే అండగా నిలుస్తున్నారని ఫిర్యాదు చేశాడు. తన అన్నలు అక్రమంగా ఆరు ఎకరాల వరకు పట్టా చేయించుకున్నారని, దీనిపై కోర్టులో కేసు నడుస్తున్నదని తెలిపాడు. దీంతో సీపీ..  కమిషనరేట్ కు చెందిన డీసీపీ, ఏసీపీని  విచారణకు ఆదేశించారు. ఎంక్వైరీ చేసిన పోలీసులు.. నర్మెట సీఐ, ఎస్సై బాధితుడిపై అక్రమ కేసులు బనాయించారని, అతని భూమిని స్వాధీనపరిచేందుకు ప్రయత్నించారని తేల్చారు. దీంతో సీఐ, ఎస్సైలను సీపీ సస్పెండ్​ చేశారు.