పుణె: మహారాష్ట్రలోని పుణె జిల్లా బారామతిలో బుధవారం ఉదయం ఓప్రైవేట్ సంస్థకు చెందిన శిక్షణ విమానం కుప్పకూలింది. జనవరిలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమానం ప్రమాదానికి గురై మరణించిన అదే గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. విమానంలో పైలట్ ఒక్కరే ఉన్నారు. ఆయన సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు.
ఉదయం 8:50 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పుణె ఎస్పీ సందీప్ సింగ్ గిల్ వివరించారు. నేలను తాకడానికి ముందు విమానం ఒక విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టిందన్నారు. సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ల్యాండింగ్ సమయంలో ఒక పక్క భాగం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన తర్వాతే విమానం నేలకూలిందని ఎస్పీ తెలిపారు. ప్రమాదానికి గురైన విమానం రెడ్‌బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకి చెందినదిగా గుర్తించారు.
