- ఇద్దరు విద్యార్థులను సస్పెండ్ చేసిన కాలేజ్ మేనేజ్మెంట్
ఖమ్మం టౌన్, వెలుగు : నగర శివారు వెలుగుమట్లలోని ఓ ప్రైవేట్ఇంటర్ కాలేజ్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. కాలేజ్క్యాంపస్ లో ఇద్దరు సెకండియర్ విద్యార్థులు.. ఫస్టియర్ విద్యార్థి మామిడాల విశాల్ పై ఈనెల 14వ అర్ధరాత్రి విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. ముస్తఫానగర్ కు చెందిన కవిత, రమేశ్ దంపతుల కొడుకు విశాల్ ఖమంలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో ఇంటర్ ఫస్టియర్చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు.
అదే కాలేజ్ లో ఇల్లందుకు చెందిన నషీర్పాషా, కారేపల్లికి చెందిన రవి ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. ఈనెల 14న విద్యార్థుల మధ్య మనస్పర్ధలు రావడంతో విశాల్‌పై ఇద్దరు సెకండియర్ విద్యార్థులు దాడి చేశారు. దీంతో విశాల భుజానికి గాయం కావడంతో తోటి విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. వారు వచ్చి గాయపడిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఇరువురి తల్లిదండ్రులను యాజమాన్యం పిలిచి విషయం చెప్పారు.
తల్లిదండ్రుల ఆగ్రహం..
గాయపడిన విశాల్ ను చూసి అతడి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీలో ఇంత జరుగుతున్నా యాజమాన్యం ఏం చేస్తుందని నిలదీశారు. దాడి చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. క్యాంపస్ ప్రహరీ గోడ దూకి విద్యార్థులు మద్యం తాగి వచ్చిన తమ కొడుకుపై దాడి చేశారని ఆరోపించారు. విద్యార్థుల గురించి యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై కాలేజ్ మేనేజ్మెంట్ ను వివరణ కోరగా, స్టూడెంట్స్ మధ్య మనస్పర్ధలు వచ్చి దాడి చేసుకున్నట్లు తెలిపారు.
డ్రగ్స్, మద్యం తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తమని కొట్టిపారేశారు. దాడి చేసిన ఇద్దరు విద్యార్థులను కాలేజ్ నుంచి ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు వివరించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
