బులవాయో: అండర్–19 వరల్డ్ కప్‌లో ఇండియా కుర్రాళ్ల జైత్రయాత్ర కొనసాగుతోంది. విహాన్ మల్హోత్రా (109 నాటౌట్) సెంచరీకి తోడు అభిగ్యాన్ కుండు (61), వైభవ్ సూర్యవంశీ (52) దుమ్మురేపడంతో.. మంగళవారం జరిగిన సూపర్ 6 రౌండ్ గ్రూప్–బి మ్యాచ్‌లో ఇండియా 204 రన్స్ భారీ తేడాతో జింబాబ్వేపై గెలిచింది. టాస్ ఓడిన ఇండియా 50 ఓవర్లలో 352/8 స్కోరు చేసింది. ఖిలాన్ పటేల్ (30), ఆరోన్ జార్జ్ (23), కెప్టెన్ ఆయుష్ మాత్రే (21), ఆర్.ఎస్. అంబరీష్ (21) మోస్తరుగా ఆడారు. విహాన్, అభిగ్యాన్ ఐదో వికెట్‌కు 113 రన్స్ జోడించారు.
టెటెండా చిముగోరో 3, పనాషి మజాయ్, సింబరాషే ముడ్జెంగెరెరే చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత జింబాబ్వే 37.4 ఓవర్లలో 148 రన్స్‌కే ఆలౌటైంది. లీరోయ్ చివాలా (62) టాప్ స్కోరర్. కియాన్ బ్లిగ్నట్ (37), చిముగోరో (29) మినహా మిగతా వారు నిరాశపర్చారు. ఉదవ్ మోహన్ (3/20), ఆయుష్ మాత్రే (3/14), అంబరీష్ (2/19) దెబ్బకు జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఎనిమిది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. విహాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆదివారం జరిగే ఆఖరి మ్యాచ్‌లో ఇండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడుతుంది.
